telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ..టీఆర్ఎస్ లోకి మరో ఎమ్మెల్యే!

MLA Upender Reddy Join shortly TRS

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుబ్బ తగిలింది. ఇప్పటికే అయిదుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ప్రకటించగా తాజాగా ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి కూడా టీఆర్ఎస్ లో చేరనున్నట్లు ప్రకటించారు. దీంతో అధికార పార్టీ వ్యూహానికి కాంగ్రెస్‌ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతుంది.మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉపేందర్‌రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై గెలుపొందారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. ఖమ్మంలో జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్‌ బహిరంగ సభలో పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత కాంగ్రెస్‌ నుంచి టీఆర్ఎస్ లో చేరుతున్న ఆరో ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి. కాంగ్రెస్‌ సభ్యుల్లో మూడింట రెండొంతుల మందిని టీఆర్ఎస్ లో చేర్చుకోవడం ద్వారా సీఎల్పీని విలీనం చేసుకోవాలని అధికార పార్టీ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదాను గల్లంతు చేయడంతో పాటు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఆ పార్టీని దెబ్బతీయాలని టీఆర్ఎస్ వ్యూహం పన్నినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌ సభ్యుల సంఖ్య 19 కాగా వారిలో 14 మంది ఆ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరితే విలీనం జరిగే అవకాశం ఉంది.

కాంగ్రెస్‌ నుంచి ఇప్పటికే ఆరుగురు బయటికి రాగా శాసనసభాపక్షం విలీనం కావాలంటే మరో ఎనిమిదిమంది సభ్యులు కావాలి. వారిని కూడా సమీకరించే దిశగా టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ ను అమలుచేస్తున్నట్టు తెలుస్తోంది. రేగా కాంతారావు (పినపాక), ఆత్రం సక్కు (ఆసిఫాబాద్‌), చిరుమర్తి లింగయ్య (నకిరేకల్‌), హరిప్రియ (ఇల్లందు), సబితారెడ్డి (మహేశ్వరం) ఇప్పటికే తెరాసలో చేరుతున్నట్లు వెల్లడించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సైతం టీఆర్ఎస్ లో చేరుతునట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Related posts