telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత: తానేటి వనిత

vanitha tatineni minister

వైసీపీ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని ఏపీ మంత్రి తానేటి వనిత అన్నారు. విశాఖలోని కేజీహెచ్‌లో 42 లక్షల వ్యయంతో నిర్మించిన సఖి వన్‌ స్టాప్‌ సెంటర్‌ ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమలో మంత్రి అవంతి శ్రీనివాస్‌ కూడా పాల్గొన్నారు. అనంతరం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. అభాగ్య, బాధిత మహిళలకు ఆసరాగా, అండగా ఉండేందుకు సఖి వన్‌ స్టాప్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని అ‍న్నారు. ఈ సెంటర్ల ద్వారా బాధిత మహిళలకు అయిదు రకాల సేవలను అందిస్తామని పేర్కొన్నారు. వేధింపులకు గురయ్యే మహిళలు 181 టోల్‌ ఫ్రీ నెంబర్‌ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.

సీఎం జగన్ తన నాలుగు నెలల పాలనలోనే మహిళా పక్షపాతి అని నిరూపించుకున్నారని అన్నారు. మహిళలకి అ‍న్ని రంగాల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం జగన్‌దేనని ప్రశంసించారు. కేబినెట్‌లో కీలకమైన శాఖలు మహిళలకు అ‍ప్పగించిన రాష్ట్రం ఏపీనేని తెలిపారు. మహిళల్లో ఉన్న 53 శాతం ఎనీమియాను తగ్గించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. తమది మహిళా సంక్షేమ ప్రభుత్వమని తెలిపారు.

Related posts