తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ వ్యాఖ్యలపై మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. గవర్నర్ తన పరిధి దాటి మాట్లాడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ రాజ్ భవన్ కు ఎప్పుడు వెళ్లాలన్నది ఆయన ఇష్టమని, గవర్నర్ తన పరిధి దాటి బీజేపీ ప్రతినిధిగా మాట్లాడుతున్నారని విమర్శించారు..
గవర్నర్ తన బాధ్యత నిర్వర్తించాలి కానీ ప్రభుత్వంపై అనవసర వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
ప్రొటోకాల్ ఎందుకు దక్కడం లేదో గవర్నర్ సమీక్షించుకుంటే మంచిదన్నారు. గతంలో ఎంతో మంది గవర్నర్లు రాష్ట్రంలో పనిచేశారని, వారితో రాని ఇబ్బంది ఈ గవర్నర్ తో ఎందుకు వస్తుందని మంత్రి ప్రశ్నించారు.
వరదలు సంభవిస్తే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉండగా గవర్నర్ ఏం పని పరామర్శలు చేయడానికి అని ప్రశ్నించారు. తెలంగాణ చరిత్ర గవర్నర్ కు తెలియదని, అందుకే విమోచనం అంటున్నారని మండిపడ్డారు.
గత గవర్నర్లతో రానీ సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చిందో చెప్పాలన్నారు. ఎవరికి ఎవరూ దూరమయ్యారో గవర్నర్ ఆలోచించాలని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
సెప్టెంబర్ 17 రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే వేడుకల్లో పాల్గొనకుండా… కేంద్రం చేసే వేడుకల్లో పాల్గొంటాననడంలో గవర్నర్ ఉద్దేశం ఏంటి? అని ఆమె ప్రశ్నించారు.
గవర్నర్ గా ఉంటారో పార్టీ నేతగా వ్యవహరిస్తారో తేల్చుకోవాలని మంత్రి సూచించారు. . రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసిస్తే ఈమే మాత్రం మరోవిధంగా మాట్లాడటం సరికాదన్నారు. గవర్నర్ తన వైఖరి ఇప్పటికైనా మార్చుకోవాలని మంత్రి సత్యవతి సూచించారు.