telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణలో ద‌క్షిణ కొరియా పెట్టుబ‌డుల‌కు స్వాగ‌తం : కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే దక్షిణకొరియా పెట్టుబడిదారులకు కంపెనీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కే .తారకరామారావు పేర్కొన్నారు. ఈరోజు దక్షిణ కొరియా పారిశ్రామిక వర్గాలు, భారతదేశ మరియు దక్షిణ కొరియా రాయబారులు, పలు రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులతో, ఇండియా కొరియా బిజినెస్ ఫోరం నిర్వహించిన సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్, దక్షిణకొరియా పారిశ్రామిక వర్గాల తోపాటు పలు కంపెనీల ప్రతినిధులకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాల గురించి ప్రత్యేకంగా వివరించి చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే తనదైన వినూత్న పారిశ్రామిక విధానాలతో అంతర్జాతీయంగా అత్యంత పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ts-ipass విధానంతో ముందుకు పోతుందని, ఈ విధానానికి ఇప్పటికే అనేక దేశాల్లోని పెట్టుబడు దారుల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. తమ పారిశ్రామిక విధానాల ద్వారా గత ఆరు సంవత్సరాల్లో సుమారు 30 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. తమ పారిశ్రామిక విధానాలు నచ్చి అనేక ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్, కొరియా పెట్టుబడిదారులకు మరియు కంపెనీలకు వివరించి చెప్పారు.

ఇప్పటికే కొరియా కంపెనీకి చెందిన ప్రపంచ ప్రఖ్యాత టెక్స్టైల్ దిగ్గజ కంపెనీ యంగ్వన్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. ఇప్పటికే తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న మెడికల్ డివైస్ పార్క్ ద్వారా కొరియాలోని గంగ్ వన్ టెక్ పార్క్ తో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నామన్నారు. దీంతోపాటు హ్యుండై కంపెనీ తెలంగాణలో తమ కార్యకలాపాలు విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్నదని ఇదే విధంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే కొరియా కంపెనీలకు రెడ్ కార్పెట్ వేస్తామని చెప్పారు. ఇందుకోసం కొరియా పారిశ్రామిక వర్గాలు, కంపెనీలు ముందుకు వస్తే తెలంగాణ లో ప్రత్యేకంగా తెలంగాణ- కొరియా పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేస్తామని ఈ దిశగా తమ సహకారం అందించాలని ఇరు దేశాల రాయబారులతో, కొరియా పారిశ్రామిక వర్గాలను కోరారు. ఇలాంటి డెడికేటెడ్ కొరియా పార్క్ ఏర్పాటు చేయడం ద్వారా కొరియా నుంచి భారత్ లోకి పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీలకు అన్ని రకాల సౌకర్యాలను ఒకేచోట అత్యంత సులువుగా అందించేందుకు వీలు కలుగుతుందని అన్నారు. తెలంగాణలో సమర్థవంతమైన నాయకత్వం తోపాటు పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉన్నదని తెలంగాణలో నీటి కొరత లేదని 24 గంటల విద్యుత్తు అందుబాటులో ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలియజేశారు.

Related posts