జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో పొలిటికల్ లీడర్లు, ప్రజాప్రతినిధుల వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి… హైదరాబాద్‌లో ఏదో జరగబోతోంది.. అనే అనుమానాలను రెక్కెతించేలా నేతలు మాట్లాడుతున్నారు. ఒకరికి మించి మరొకరు ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. సంచలనాలకు తెరలేపుతున్నారు. అయితే, శాంతి భద్రతల విషయంలో ఏ పార్టీవారు అయినా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్… గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఈ నెల ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ భారీ బహిరంగసభ నిర్వహించనుంది.. ఈ సభలో సీఎం కేసీఆర్ పాల్గొనబోతున్నారు. ఇవాళ ఎల్బీ స్టేడియంలో సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కేటీఆర్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని… ఎటువంటి కార్యక్రమాలు చేపట్టేది సభలో కేసీఆర్ చెబుతారని వెల్లడించారు. గ్రేటర్ ప్రజలు స్వచ్ఛందంగా ఈ సభలకు తరలిరావాలని పిలుపునిచ్చిన కేటీఆర్.. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఎన్నికల ప్రచార సభ నిర్వహిస్తామన్నారు. వేల సంఖ్యలో ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఇక, హైదరాబాద్ నగరంలో చిచ్చుపెట్టాలని ప్రయత్నం చేస్తే ఊరుకోబోమని కేసీర్ స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేసిన కేటీఆర్.. శాంతి భద్రతల విషయంలో ఏ పార్టీవారైనా వదిలిపెట్టబోమన్నారు.. మేం ప్రభుత్వం నడుపుతున్నవాళ్లం.. ఎప్పుడు ఏం చేయాలో.. అది చేస్తామన్నారు.
previous post