telugu navyamedia
ఆంధ్ర వార్తలు

గుడివాడలో ఎన్టీఆర్ విగ్రహాం : సీఎం జగన్‌కు పాదాభివందనం

రాజకీయాలకు అతీతంగా కృష్ణా జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టినందుకు సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి మంత్రి కొడాలి నాని ధన్యవాదాలు తెలియజేశారు. శనివారం గుడివాడలో ఎన్టీఆర్‌ విగ్రహానికి మంత్రి నాని పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చని హామీ ప్రకారం కొత్త జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టారు. ఇది హర్షించదగిన విషయం. ఎన్టీఆర్‌ అభిమానుల తరపున సీఎం జగన్‌కు పాదాభివందనం చేస్తున్నామని అన్నారు.

కొందరు టీడీపీ నేతలు దీనిని కూడా రాజకీయం చేస్తున్నారని.. దీనినిబట్టి ఎన్టీఆర్‌పై వారు ఎంత ద్వేషంతో ఉన్నారో అర్థమవుతోందన్నారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు చేసిందేమీ లేకపోయినా ఆయన డబ్బా మీడియా వివిధ రకాలుగా ప్రచారం చేసినా ప్రజలు అవేవీ నమ్మకుండా టీడీపీకి తగిన బుద్ధి చెప్పారని మంత్రి కొడాలి నాని విమర్శించారు.

టీడీపీ ఓ దిక్కుమాలిన పార్టీ అని… డబ్బా పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పరంగా ఎన్టీఆర్, వైఎస్ఆర్‌ మధ్య వైరం ఉన్నా తమ సీఎం జగన్ అవేమీ పట్టించుకోకుండా తెలుగు ప్రజల కోసం ఎన్నో సేవలు చేసిన ఎన్టీఆర్‌ను స్మరించుకునేందుకు కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారని వివరించారు. వైఎస్ఆర్ ఆశయాలనే కాకుండా ఎన్టీఆర్ చేసిన సేవలను జగన్ ఆదర్శంగా తీసుకుని పాలన సాగిస్తున్నారని తెలిపారు.

ప్రతిపక్షం ఎప్పుడూ కూడా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని.. అయితే చంద్రబాబు మాత్రం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. 

Related posts