telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్ రాదు: హరీష్‌రావు

కరీంనగర్‌లోని ఇల్లందకుంటలో టీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. మంత్రులు హరీష్‌రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఇతర టీఆర్‌ఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు. హుజూరాబాద్‌లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇప్పటికే టీఆర్‌ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను ప్రకటించారు. బీజేపీ తరపున ఈటల అభ్యర్థిత్వం ఇంకా ఖరారు కాలేదు. కాంగ్రెస్ అభ్యర్థిని కూడా ప్రకటించాల్సి ఉంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఉప ఎన్నికలో తమ అభ్యర్థిని గెలిపించాలని మంత్రులు రంగంలోకి దిగారు.

హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్ కూడా రాదని.. టీఆర్‌ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉందని మంత్రి హరీష్‌రావు అన్నారు. ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు తెలుసని అన్నారు. ఈటల రాజేందర్ రైతుబంధు పథకం వద్దని అంటున్నారు, వద్దన్నవారిని ఏం చేయాలో ప్రజలకే తెలుసని అన్నారు. సంక్షేమ పథకాలను విమర్శించే ఈటల గురించి ప్రజలు ఆలోచించాలని అన్నారు. ఎక‌రం అమ్మి ఎన్నిక‌ల్లో గెలుస్తాన‌న్న ఈట‌ల‌కు మ‌ద్ద‌తిస్తారో.. ఎక‌రం కూడా లేని ఉద్య‌మ నాయ‌కుడికి ఓటు వేసి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తారో ప్ర‌జ‌లే తేల్చాల‌న్నారు.

హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మహిళా భవనాలు నిర్మిస్తామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. హుజూరాబాద్‌లోని అన్ని గ్రామాల్లో మహిళా భవనాలు నిర్మించనున్నట్లు తెలిపిన మంత్రి మహిళా భవనాల కోసం రూ.4 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. నియోజకవర్గానికి ప్రభుత్వం కేటాయించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ఈటల రాజేందర్‌ కట్టించలేదన్నారు. హుజూరాబాద్‌కు 4 వేల ఇళ్లు మంజూరైతే ఈటల పట్టించుకోలేదన్నారు. హుజూరాబాద్‌లో 4 వేల డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టించే బాధ్యత నాది అని మంత్రి హరీష్‌రావు అన్నారు. మేము మాటలు చెప్పేవాళ్లం కాదు, పనులు చేసేవాళ్లం అన్నారు. సీఎం కేసీఆర్‌ మాట తప్పని నాయకుడని అన్నారు.

Related posts