telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణలో రోజుకు 10 లక్షల మందికి టీకా!

బ్రిటన్‌ నుంచి రాష్ట్రానికి వచ్చిన ప్రయాణికుల్లో ఇప్పటివరకు ఏడుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఈ నెల 9 నుంచి వచ్చిన 1200 మందిలో 846 మందిని గుర్తించి పరీక్షలు నిర్వహించగా ఈ విషయం వెల్లడైందన్నారు. వీరిలో ఏరకమైన వైరస్‌ ఉందో తెలుసుకునేందుకు నమూనాలను సీసీఎంబీ ప్రయోగశాలకు పంపినట్లు పేర్కొన్నారు. వీరంతా హైదరాబాద్‌, మేడ్చల్‌, జగిత్యాల, సిద్దిపేట, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలకు చెందిన వారన్నారు. వీరిని, పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చిన వారిని సైతం ప్రత్యేకంగా పరిశీలిస్తున్నామని వివరించారు.

కొత్త వైరస్‌ బాధితులకు చికిత్స అందించేందుకు టిమ్స్‌లో మూడు అంతస్తులను కేటాయించినట్లు చెప్పారు. గురువారమిక్కడ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ వాకాటి కరుణ, వైద్య విద్య సంచాలకులు రమేష్‌రెడ్డి, ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు, టీఎస్‌ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, కొవిడ్‌ సాంకేతిక నిపుణుల కమిటీ సభ్యులు గంగాధర్‌తో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు. కొత్తరకం కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తిచెందుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. క్రిస్మస్‌, కొత్త ఏడాది, సంక్రాంతి వేడుకలను ఇంటికే పరిమితమై జరుపుకోవాలని కోరారు.
రోజుకు 10 లక్షల మందికి టీకా!
రాష్ట్రంలో తొలిదశ కింద 70 నుంచి 80 లక్షల మందికి టీకా వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి తెలిపారు. వైద్యఆరోగ్య, పోలీసు, పురపాలక, అగ్నిమాపక సిబ్బందితో పాటు వయసుపైబడిన వారికి తొలిదశలో ఇస్తామని వెల్లడించారు. టీకా వేసేందుకు 10 వేల మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చామని, ఒక్కొక్కరు రోజుకు 100 మందికి వ్యాక్సిన్‌ వేస్తే రోజుకు 10 లక్షల మందికి టీకా వేయవచ్చని తెలిపారు. తొలిడోసు ఇచ్చిన 28 రోజుల్లో రెండో డోసు ఇచ్చేందుకు వీలుగా సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేశామని వివరించారు.

Related posts