జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొన్ని పార్టీలు సాధ్యం కానీ హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటే.. మరికొందరు నేతలు.. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఓట్లను రాబట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పలువురు నేతలు చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి.. వాటిని పరిశీలించి కేసులు నమోదు చేసే పనిలో ఉన్నట్టు పోలీసులు ప్రకటించారు. ఇప్పటికే కొందరిపై కేసులు కూడా బుక్ చేశారు. ఇక, ఇప్పుడు బెదిరింపుల పర్వం కూడా తెరపైకి వచ్చింది.. ఓల్డ్ సిటీలో తమకు ఎదురేలేదని చెప్పుకునే ఎంఐఎం నేతలు.. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను భయాందోళనకు గురిచేసే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏకంగా బహిరంగసభల్లో స్టేజ్‌లు ఎక్కి.. ప్రత్యర్థులను హెచ్చరిస్తున్నారు. పాతబస్తీ కిషన్ బాగ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మజ్లీస్ పార్టీ అభ్యర్థి హుస్సేనీ పాషా.. ఓ బహిరంగసభలో మాట్లాడుతూ… ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను బహిరంగంగా హెచ్చరించారు.. మేం గెలిస్తే పాతబస్తీ గల్లీల్లో మిమ్మల్ని తిరగనివ్వం అంటూ.. తనపై పోటీ చేసిన ప్రత్యర్థి పార్టీలకు చెందిన అభ్యర్థులకు వార్నింగ్ ఇచ్చారు. మజ్లీస్ గెలిస్తే ఎంఐఎం కార్యకర్తలు మిమ్మల్ని బతుకాన్నివ్వరు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. దశాబ్దాలుగా ఉన్న.. ఇక్కడే స్థిరపడి ఉన్న.. మా ఏరియా నుండి వెళ్లిపోక తప్పదు అని.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అంటూ బహిరంగ సభలో హెచ్చరించాడు కిషన్ బాగ్ మజ్లీస్ అభ్యర్థి హుస్సేనీ పాషా. ఇప్పుడా వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
previous post
టీటీడీకొచ్చే ఆదాయంపై ..టీజీ వెంకటేశ్ సంచలన వ్యాఖ్యలు