బాల్యంలో అంటే 60, 70 ప్రాంతాల్లో మన మధ్యతరగతి ఇళ్లల్లో తరచుగా వినపడే మాటలు..
బంధువులు ఊరినుంచి రాగానే మంచినీళ్లిచ్చి, కుశల ప్రశ్నలు వేసినాక “పొద్దున్న ఎప్పుడనగా బయలు దేరారో ఏమో, కాళ్ళు కడుక్కోండి వడ్డించేస్తాను” అనే ఇల్లాలు
పొద్దున్నే పాలవాడు గిన్నెలో పాలు పోయగానే
“ఈ మధ్య బొత్తిగా నీళ్ల పాలు పోసేస్తున్నావు”
పక్క వీధి పిన్నిగారితో “మీ కోడలు నీళ్ళోసుకుందిటగదా.. ఇప్పుడు ఎన్నో నెల?”
అనే ఎంక్వయిరీ లు.
“ఈ రోజు మా తాతగారి తద్దినం. నాలుగు అరిటాకులు అడిగి కోసుకు రమ్మంది మా అమ్మ ?” పక్కింటి పిల్లాడి అభ్యర్ధన.
“వెళ్ళేటప్పటికి బాగా రాత్రి అవుతుంది కదా!
కాస్త పులిహోర, పెరుగన్నం చేసిస్తాను. రైలులో తిందురుగాని” ప్రయాణమవుతున్న బంధువులతో ఆప్యాయంగా ఇల్లాలు.
“మీ పిల్లకు సంబంధాలు ఏమన్నా చూస్తున్నారా లేక మేనరికాలు ఉన్నాయా?” పొరుగింటి పిన్నిగారి ఆరా
“ఈ నెల నుంచి అద్దె ముప్పై పెంచుతానంటున్నారు
ఇంటాయన” అద్దె ఇంటాయన
“ముందు ఆ బాత్ రూమ్ తలుపు రిపేర్ చేయించి పెట్టమనండి” ఇంటామే ఇచ్చిన హింటు.
“పరీక్షలు దగ్గిర పడుతున్నాయి. ఇక ఆటలు ఆపి చదవండి” నాన్నగారి హుంకరింపు
“*తెల్లారగట్లే అయిదింటికి లేపుతా*.. నాతోబాటే లేచి చదవండి. తెల్లారగట్ల చదివితే బాగా వస్తుంది చదువు” అమ్మ బుజ్జగింపు.
“ఏమండి.. బియ్యం తేవాలి. ఇక రెండు రోజులే వస్తాయి” ఇల్లాలి అల్టిమేటం.
“మీరు చదవడం అయిపోతే ఈ వారం ప్రభ ఒకసారి ఇవ్వండి పిన్ని గారూ… జీవనతరంగాలు చదివి ఇచ్చేస్తాను” పక్కింటావిడతో ఇంటావిడ
“వెంకటేశా లో మాయాబజారు సినిమా మార్నింగ్ షోలు వేస్తున్నారుట. రేపు ఉదయం పిల్లలు స్కూళ్లకి, అన్నయ్య గారు ఆఫీస్ కి వెళ్ళాక వెళ్లొద్దామా వదిన గారూ?” పక్కింటావిడ ప్రపోజల్.
“వారంలో ఒక్కరోజైనా నాగా పెట్టకుండా ఉండవు గదా నువ్వు?” పనిమనిషితో కోపంగా ఇంటి ఇల్లాలు
“పెద్దాడు ఇంకా మణియార్డర్ పంపలేదేమిటో?”
ఓ పెద్దాయన ఆరాటం.
“పంపుతాడు లెండీ. జీతాలు ఇచ్చారోలేదో “
కొడుకుని వెనకేసుకొస్తూ పెద్దాయన భార్య.
ఎవరన్నా బంధువులు ఇంటికి వస్తే, వారిని ఆదరంగా ఆహ్వానిస్తూ “పొద్దున్న కాకి ఒకటే అరుస్తుంటే, ఇవాళ ఎవరో ఇంటికి వస్తారు అని అనుకుంటూనే ఉన్నాను. రండి రండి”
“సరే… జీతాలు రానీ.. కొందాం” నెలాఖరులో అందరి నాన్నల స్టాక్ డైలాగ్
అప్పటి టెలిగ్రాములలో మచ్చుకి కొన్ని
“Start immediately. Father not well”
“Arriving by tenth circar”
“Lakshmi delivered male child on fifth. Both are safe”
“ఈసారి పండగ కి రేషన్ కార్డు మీద ఇంకో కిలో పంచదార ఎక్కువ ఇస్తున్నారుట” అమ్మ ఆనందం.
“కిరసనాయిలు కూడా ఇస్తే బాగుండును. కరెంట్ అస్తమానూ పోతోంది” పక్కింటి పిన్నిగారి ఆశాభావం.
“మొన్న ద్రోణంరాజు గారింట్లో పట్టపగలే గోడ దూకి దండెం మీద ఆరేసిన బట్టలు, ఇత్తడి
బింద ఎత్తుకుపోయారుట!” అమ్మలక్కల వెర్రి.
“అయినా చోద్యం కాకపొతే ఇత్తడి బింద అలా బయట వదిలేస్తారా ఎవరైనా.. ఎత్తుకెళ్లిపోరూ మరి?” ఒక పిన్నిగారి మూతి విరుపు.
“ఏంట్రా ఈ మార్కులు… హాఫ్ ఇయర్లీ కి కూడా ఇలాగే వస్తే చెప్తా నీ సంగతి” నెత్తి మీద నాలుగు పీకి ప్రోగ్రెస్ కార్డు సంతకం పెడుతున్న నాన్నగారు.
“నాన్నగారు అన్నవరం క్యాంపు కి వెళ్ళివచ్చారు. ప్రసాదం ఇచ్చిరమ్మంది అమ్మ” సత్యనారాయణ స్వామి ప్రసాదం పొట్లం ఇస్తూ పక్కింటి పిల్ల.
కళ్లకద్దుకుని మరీ తీసుకున్న ఇల్లాలు.
“నాన్న గారి తిధి మళ్ళా ఆదివారమే. పచారీ సామాను ఏం కావాలో చూసి లిస్టు రాయి. సాయంత్రం వెళ్లి శాస్త్రి గారికి చెప్పి వస్తా” అంటున్న నాన్నగారి మాటలు విని తాతగారి తద్దినానికి వచ్చే మేనత్త పిల్లలు, బాబాయ్ పిల్లలతో ఆడుకోవొచ్చనే పిల్లల ఆనందం
“నల్లులు ఎక్కువైపోయాయి. నల్లుల మందు తెండి. రేపు అదివారం మందు కొట్టి మంచాలు ఎండలో పడేద్దాం” ఇప్పుడు దోమల్లాగ అప్పుడు నవారు మంచాల్లో నల్లుల బాధ
“ఈ బియ్యం తీసుకెళ్లి మరాడించుకుని రారా. శనివారం ఫలహారం ఉప్పుడుపిండి చేయాలి”
కొడుకుతో తల్లి.
“అలాగే ఆ చేత్తోటే ఓ మెట్టవంకాయ కాల్చి పులుసు పచ్చడి పెట్టమ్మా. మీ ఆయనకు పిండిలోకి ఇష్టం” కొడుకు ఇష్టం తెలిసిన తల్లి గారు కోడలుతో
“మీ అబ్బాయికి బ్యాంకు ఉద్యోగం వచ్చిందిట గదా… సంతోషం. ఇక పెళ్లి చేసేయొచ్చు” కుర్రాడి తండ్రితో పక్కింటాయన.
“ఏదీ ఇంకా జాయినే కాలేదు. అప్పుడే పెళ్ళా?”
కుర్రాడి తండ్రి.
“ఇప్పుడే కాదులెండి. సందర్భం వచ్చింది కనుక చెప్తున్నా… మా బావమరిది కూతురు ఉంది. బంగారుబొమ్మ. డిగ్రీ చదువుతోంది. కాస్త దృష్టిలో పెట్టుకోండి” పిల్ల మేనత్త మొగుడు కర్చీఫు వేసేసి కాఫీ తాగి వెళ్ళాడు 😃😃
ఇప్పటి మన జీవితాలతో పోల్చుకోండి. చాలా తక్కువ వినబడుతున్నాయి ఈ సంభాషణలు,
ఆ ఆప్యాయతలు. 😢😢
అన్నీ చదవడం ద్వారా అప్పటి మన మధ్యతరగతి ఇంటి వాతావరణాన్ని మళ్ళీ సృష్టించుకుందాం.
🙏🌷🙏🌷🙏