ఉగాది కానుకగా ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ నగరంలో మెట్రోరైలులో ప్రయాణించేవారికి స్మార్ట్ కార్డు ధరను తగ్గించింది. ఈ కార్డును ఇప్పుడు రూ.75కే కొనుగోలు చేయవచ్చు. అయితే మూడు నెలల వరకు ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇందులో రూ.50 వరకు ప్రయాణానికి ఉపయోగించుకోవచ్చు. నగదు అయిపోగానే కనీసం రూ.50, గరిష్ఠంగా 3వేల వరకు రీఛార్జ్ చేసుకొనే అవకాశం ఉంది.
ఇప్పటివరకు కార్డు కోసం రూ.150 చెల్లించాల్సి వచ్చేది. ఈ మొత్తంలో రూ.20 తిరిగి చెల్లించరు. మిగతా మొత్తం ప్రయాణానికి ఉపయోగించుకోవచ్చు. ఇప్పటివరకు 6 లక్షలపైగా కార్డులను మెట్రో విక్రయించింది. నిత్యం ప్రయాణించే 2.20 లక్షల మందిలో 1.50 లక్షల మంది వరకు వినియోగిస్తున్నారు.