మెట్రోకు మళ్ళీ మంచి రోజులు వచ్చాయి. మెట్రో రైలులో ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇతర రవాణ వ్యవస్థలో తీసుకుంటున్న కరోనా జాగ్రత్తల కన్నా మెట్రో లో సేఫ్టీ ఎక్కువ అన్న భావన ప్రయాణికుల్లో కలగడంతో ఆదరణ పెరిగింది. మరోవైపు మెట్రో ప్రయాణికులకు క్యాష్ బ్యాక్, ట్రిప్పుల తగ్గింపుతో అదనంగా ప్రయాణిస్తున్నారు. దేశంలో అన్ని మెట్రోల కన్నా దిల్లీ తర్వాత హైదరాబాద్లో ఎక్కువమంది ప్రయాణిస్తున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. గత శనివారం ఢిల్లీ మెట్రలో 14 లక్షల 79 వేల మంది ప్రయాణిస్తే… హైదరాబాద్ మెట్రో లో లక్షా 33 వేల 974 మంది ప్రయాణించారు.తర్వాతి స్థానాల్లో చెన్నై, బెంగళూర్, కొచ్చి, నాగ్‌పూర్, లక్నో, జైపూర్, ముంబై ఉన్నాయి. హైదరాబాద్లో మొదట మూడు కారిడార్లలో దశల వారీగా ప్రారంభించి… అన్ని కారిడార్లలో సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది మెట్రో. మొదట్లో మూడు కారిడార్లలో కలిపి కేవలం 30 వేల మంది వరకు మాత్రమే ప్రయాణాలు చేశారు. ఆ తర్వాత క్రమంగా సంఖ్య పెరుగుతూ వచ్చింది. . ప్రస్తుతం రోజుకు లక్ష 30 వేల మందికి పైగా ప్రయాణిస్తున్నారు. బస్సుల్లో శానిటైజేషన్, సామాజిక దూరం సరిగా పాటించకపోవడంతో మెట్రోను ఆశ్రయిస్తున్నారు. బస్సుతో పోలిస్తే మెట్రో ఛార్జీ ఎక్కువే అయినా… ఇటీవల ఆఫర్లు ప్రకటించడంతో ఇటువైపే మొగ్గుతున్నారు. సాఫ్ట్‌వేర్ కార్యాలయాలు తెరుచుకుని.. స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం అయితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
previous post
కర్ణాటకలో 300 మంది ఫోన్ల ట్యాప్: ఎంపీ సుమలత