ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అక్టోబరు 29 నుంచి మెట్రో రైలు, డిటిసి, క్లస్టర్ బస్సు సర్వీసుల్లో ‘బారు దూజ్’ పేరుతో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్షా బంధన్ బహుమతిగా మహిళలకు రక్షణతో కూడిన ప్రయాణాన్ని ఉచితంగా అందించేందుకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీలో 5,500 డిటిసి, క్లస్టర్ బస్సులు నడుస్తున్నాయి. తాజాగా ప్రకటించిన బారు దూజ్ పథకం వల్ల ప్రభుత్వంపై సుమారు రూ.700 కోట్ల భారం పడుతుంది.
డిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌లో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం సమాన భాగస్వాములుగా ఉన్నాయి. తాజా పథకం అమలుకు ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్, కేంద్రం అంగీకరించాల్సి ఉంది. అందువల్ల ఈ పథకం అమలు కష్టసాధ్యమయ్యే అవకాశం ఉందనే ప్రచారం ఉంది. బిజెపి ఢిల్లీ అధ్యక్షుడు మనోజ్ తివారీ మాట్లాడుతూ కేజ్రీవాల్ మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయి ఇలాంటి పథకాలను ప్రవేశపెడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో ఆప్ డిల్లీ రాష్ట్ర పరిధిలో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. వచ్చే ఏడాది జూన్‌లో డిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే ఈ పథకాన్ని కేజ్రీవాల్ ప్రవేశపెట్టినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.