ఐదు దశాబ్దాలకు పైగా తన మధురగానంతో కోట్లాది మందిని ఉర్రూతలూగించిన గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దివికేగారు. ఆయన మరణవార్తతో యావత్ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. ఎస్పీ బాలు అకాల మరణంపై పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. ప్రపంచం గర్వించే అరుదైన గాయకులు ఇలా దూరమవడం తనను తీవ్రంగా కలచివేసిందని భావోద్వేగానికి గురయ్యారు. ‘పాటే తపమని.. పాటే జపమని.. పాటే వరమని.. పాటకోసమే పుట్టిన మహానుభావులు ఎస్పీ బాలుగారి లోటు మరే గాయకులు పూడ్చలేనిది. ‘ఊహ తెలిసినప్పుడు.. ఊహల్లో తేలినపుడు.. ఊయలూగినపుడు.. ఊగిసలాడినపుడు బాలుగారి పాటలే వినిపించేంతటి అమర గాయకులు శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పుట్టడం ఆ జిల్లాకు చెందినవాడిగా అదృష్టంగా భావిస్తున్నట్టు మంత్రి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. ‘సింహపురి’లో జన్మించిన గాయకులు.. ప్రపంచం గర్వించదగ్గ గాన గంధర్వులు’ అని మంత్రి వ్యాఖ్యానించారు. చివరి శ్వాస వరకూ తను పాటిన ప్రతిపాటకు ప్రాణం పోశారని మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఒక్క సందర్భానికీ ఆయన పాట ఒకటుంటుందన్నారు. నటించినవారే పాడినట్లుగా పాడడం మరెవరికీ సాధ్యం కాదని మంత్రి గౌతమ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మాటాడినా.. పాటాడినా తెలుగు భాషే సంతోషపడేలా తెలుగుజాతి సగర్వంగా చెప్పుకునేలా చేసిన, 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడిన బాలసుబ్రమణ్యంగారు భౌతికంగా దూరమైనా ‘పాట’లో మనతో మనలోనే శాశ్వతంగా ఉంటారని మంత్రి మేకపాటి తెలిపారు.
ఏపీ బ్రాండ్ ఇమేజ్ను వైసీపీ నాశనం చేసింది: యనమల