telugu navyamedia
Uncategorized ట్రెండింగ్ సినిమా వార్తలు

పవన్ కే మా మద్దతు… జగన్ పార్టీకి వెళ్లే ఆలోచన లేదు

chiru

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. దాసరి తరువాత ఆ ప్లేస్‌ను భర్తీ చేస్తూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారాల్లో కీలక భూమిక పోషిస్తున్నారు. తాజాగా కరోనా వైరస్ వల్ల ఇబ్బందులు పడుతున్న వేలాది మంది సినీ కళాకారుల్ని ఆదుకునేందుకు కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)ని స్థాపించి అనేక మందికి మార్గదర్శకంగా నిలిచారు. ఓ ప్రముఖ వెబ్ సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు చిరంజీవి. ఇక రాజకీయాలను వదిలేసినట్టేనా అన్న ప్రశ్నకు వదిలేసినట్టే అంటూ ఆన్సర్ ఇచ్చారు చిరంజీవి. తన కుటుంబానికి సంబంధించి తన తమ్ముడు పవన్ పాలిటిక్స్‌లో ఉన్నాడని.. మిగిలిన వాళ్లు అతనికి మద్ధతు ప్రకటిస్తామన్నారు. ‘అన్న ఒకవైపు తమ్ముడు మరోవైపు ఉంటే మమ్మల్ని అభిమానించి గుండెల్లో పెట్టుకున్న అభిమానులు అయోమయంలో ఉండే పరిస్థితి ఉంది. అందుకే నేను నా తమ్ముడు స్థాపించిన ‘జనసేన’ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నాను. అతని పట్టుదల గురించి నాకు తెలుసు. ఈరోజు కాకపోతే రేపటి రోజునైనా తాను అనుకున్నది సాధిస్తాడు. మా దారులు వేరు కావచ్చు కాని గమ్యం ఒక్కటే. ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం కళ్యాణ్ కు వుంది. ఆరోజు పార్టీలో జరిగిన పరిణామాలు మొత్తం దగ్గరుండి చూశాడు. నా అనుకుని వచ్చిన వాళ్లు.. నేను చేరదీసిన వాళ్లు నన్ను దెబ్బతీశారనే భావన కళ్యాణ్‌లో ఉంది. నాకు తగిలిన ఎదురు దెబ్బల నుంచి కళ్యాణ్ గుణపాఠం నేర్చుకున్నాడు. అలాంటి తప్పు మళ్లీ జరగకుండా జాగ్రత్తగా ఉంటున్నాడు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కుటుంబంతో ముందు నుంచి మంచి అనుబంధం ఉంది. ఆ సాన్నిహిత్యంతోనే ఇటీవల ఆయన్ని కుటుంబ సమేతంగా కలిశాను. నిజానికి ఆయన ప్రమాణ స్వీకారానికే వెళ్లాల్సి ఉంది. నన్ను ఆహ్వానించారు. కాని నా కాలు బాలేకపోవడంతో వెళ్లలేదు. కాని ఫోన్ ద్వారా విషెష్ అందించా. ఇటీవల సాక్షి ఓపెనింగ్‌కి పిలిచినప్పుడు అలాగే సాక్షి ఎక్స్ లెన్సీ అప్పుడు నన్ను ఆహ్వానించారు. వెళ్లాను. వాళ్లు నన్ను రిసీవ్ చేసుకున్న తీరు అద్భుతం. జగన్ భార్య భారతి మాట్లాడిన విధానం నన్ను ఆకట్టుకుంది. జగన్‌ని కలవడం, వారి ఆతిథ్యం అమేజింగ్ ఎక్స్ పీరియన్స్. అయితే జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం నాకు నచ్చింది అందుకే అభినందించా. మంచి చేస్తే అది ఎవరైనా సరే అభినందించడం నా విధి. వీటిలో రాజకీయపరమైన చర్చకు తావులేదు. నేను వెళ్లి జగన్‌ని కలవడం పెద్ద న్యూస్ అయ్యింది. నిజానికి మా మధ్య ఎలాంటి రాజకీయ పరమైన చర్చలు జరగలేదు. అసలు ఆ ప్రస్తావనే తీసుకురాలేదు ఆయన. ఆ గౌరవం అలాగే ఉంచారు. జగన్ ఒకవేళ పార్టీలోకి ఆహ్వానిస్తారని కూడా నేను అనుకోను. ఎందుకంటే నా స్టాండ్ ఏంటన్నది ఇప్పటికే చెప్పా. ఇంట్లో తమ్ముడు ఉన్నాడు.. వాడి మాటే మా మాట అని. బహుశా ఆయనికి ఇది తెలిసి ఉండదు అని అయితే నేను అనుకోను. ఒక ఇంట్లో ఒక స్టాండ్ మాత్రమే ఉండాలి. రాజకీయాల్లో నా ప్రయత్నం నేను చేశాను. ఇప్పుడు మా తమ్ముడు పట్టుదలతో ముందుకు వెళ్తున్నాడు. ఈ 64 ఏళ్ల వయసులో మళ్లీ రాజకీయాల వైపుగా ఆలోచన లేదు. కళ్యాణ్‌కే మా మద్దతు ఉంటుంది’ అంటూ క్లారిటీ ఇచ్చేశారు మెగాస్టార్ చిరంజీవి.

Related posts