telugu navyamedia
క్రీడలు

వాంఖడేలో మయాంక్ సెంచరీ..

నిలకడైన ఆటతీరు… పటిష్టమైన బ్యాటింగ్… పదునైన షాట్లతో విరుచుకుపడుతూ… వచ్చీపోయే బ్యాట్స్ మెన్లకు తోడుగా నిలిచిన మయాంక్ అగర్వాల్ అద్భుతమైన ఆటతో ఆకట్టుకున్నాడు. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్టుమ్యాచులో తొలిరోజుఆటలో అద్భుతమైన సెంచరీ చేశాడు. 59వ ఓవర్లో డేరీ మిచెల్ వేసిన తొలిబంతిని అలవోకగా బౌండరీకి తరలించి శతకాన్ని నమోదుచేశాడు. టెస్టుమ్యాచుల్లో ఇది మయాంక్ అగర్వాల్ కు నాలుగో సెంచరీ. తన సహచర బ్యాట్స్ మెన్ వృద్ధిమాన్ సాహా ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని అభినందించాడు. మయాంక్ బౌండరీతో సెంచరీకొట్టి గాల్లో ఎగిరి గర్జించిన తీరు అభిమానుల్ని ఫిదాచేసింది.

ముంబైలో రెండురోజులు కురుస్తున్న వర్షంకారణంగా… మైదానం తడిగా ఉందని ఆటను ఆలస్యంగా ఆరంభించారు. దీంతో వెలుతురు తగ్గుముఖం పట్టేలోపు 70 ఓవర్లపాటు సాగిన తొలిరోజు ఆట ముగిసింది.

తొలిరోజు ఆటముగిసే సరికి 70 ఓవర్లు ఆడిన టీమిండియా కీలకమైన నాలుగు వికెట్లను నష్టపోయి 221 పరుగులను నమోదు చేసింది.టీమిండియాపాలిట న్యూజిలాండ్ బౌలర్ అజాజ్ పటేల్ సింహస్వప్నంలా మారాడు. కోల్పోయిన వికెట్లు నాలుగింటినీ… అజాజ్ పటేల్ ఖాతాలో నమోదుకావడం గమనార్హం.

తొలిరోజు ఆటలో ఓపెనింగ్ బ్యాట్స్ మెన్లుగా దిగిన మయాంక్ అగర్వాల్, శుభమన్ గిల్ నింపాదిగా ఆడుతూ క్రీజులో కుదురుకున్నారు. 28 ఓవర్లో మూడో బంతిని షాట్ కొట్టే ప్రయత్నంలో రాస్ టేలర్ క్యాచ్ పట్టుకుని శుభమన్ గిల్ ను పెవీలియన్ పంపాడు.

టీమిండియా తొలివికెట్ 80 పరుగులవద్ద నమోదైంది. గిల్ తర్వాత క్రీజులోకొచ్చిన చతేశ్వర పూజారా ఐదు బంతులు ఆడి అజాజ్ పటేల్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. పూజారా ఎలాంటి పరుగు తీయకుండానే గోల్డెన్ డక్ గా పెవీలియన్ బాటపట్టాడు. ఆతర్వాత వచ్చిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నాలుగు బంతులు ఆడి… అదే అజాజ్ పటేల్ బౌలింగ్ లో ఎల్బీడబల్యూగా పెవీలియన్ చేరాడు. చతేశ్వరపూజారా, విరాట్ కోహ్లీ ఇద్దరూ డకౌట్ కావడం క్రికెట్ అభిమానులను నిరాశ పరచింది.

ఆతర్వాత క్రీజులో ఉన్న మయాంక్ అగర్వాల్ కు జోడీకట్టిన శ్రేయస్ అయ్యర్ నింపాదిగా ఆడే ప్రయత్నం చేసినప్పటికీ.. అజాజ్ పటేల్ బౌలింగ్ లో టామ్ బ్లండెల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

మయాంక్ అగర్వాల్ మాత్రం వచ్చీ పోయే బ్యాట్స్ మెన్లను చూస్తూ… క్రీజులో కుదురుకుని ఆడుతున్నాడు. మయాంక్ కు జతకట్టిన టీమిండియా వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా… ఆటను చక్కదిద్ది… స్కోరు బోర్డును పరుగులుపెట్టించే ప్రయత్నం చేశారు. మయాంక్ తన బ్యాటింగ్ శైలితో అడపాదడపా… బౌండరీలు… సాధ్యమైనపుడు సిక్సర్లను బాదుతూ వ్యక్తిగత పరుగుల సాధనలో సఫలమయ్యాడు. అద్భుతమైన సెంచరీతో భారత శిబిరంలో ఆనందం నింపాడు.

స్కోరు వివరాలు..

టీమిండియా బ్యాట్స్ మెన్ మయాంక్ అగర్వాల్ 246 బంతులు ఎదుర్కొని 14 బౌండరీలు, నాలుగు సిక్సర్లతో 120 పరుగులు చేశారు. శుభమన్ గిల్ 71 బంతులు ఎదుర్కొని ఏడు బౌండరీలు, ఒక సిక్సర్ తో 44 పరుగులు నమోదు చేశారు. ఛతేశ్వర పూజారా, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇద్దరూ డకౌటయ్యారు. శ్రేయస్ అయ్యర్ 41 బంతులు ఎదుర్కొని మూడు బౌండరీలతో 18 పరుగులు చేశారు. వృద్ధిమాన్ సాహా 53 బంతులు ఎదుర్కొని మూడు బౌండరీలు, ఒక సిక్సర్ తో 25 పరుగులు నమోదు చేశారు.

Related posts