అక్కడ డిస్టెన్స్ లెర్నింగ్ డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరుగుతోంది. నాగార్జున యూనివర్సిటీ వివిధ కోర్సులకు సంబంధించి కడప జిల్లాలోని పలు ఎగ్జామ్ సెంటర్లలో ఈ తతంగం యథేచ్ఛగా సాగుతోంది. స్వయంగా ఇన్విజిలేటర్లే విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్న వైనాలు వెలుగుచూస్తున్నాయి. అయితే, దీనికి విద్యార్థుల నుంచి పెద్ద మొత్తంలో నగదు వసూలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా… ప్రశ్నించే నాథుడు లేడు. సంబంధిత అధికారులు మొక్కబడిగా తనిఖీలు చేసి… అంతా బాగానే ఉందంటూ ఎగ్జామ్ సెంటర్లకు క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు. ప్రొద్దుటూరు, మైదుకూరు, కాజీపేట, ముద్దనూరు, సిద్దవటం, రాయచోటి, పులివెందుల సహా కడప జిల్లా వ్యాప్తంగా 13 దూర విద్య డిగ్రీ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు కాపీలు అందించడానికి 2 వేలు నుంచి 3 వేలు తీసుకుంటున్నారు నిర్వాహకులు. అలాగే, ఒకరికి బదులు మరొకరితో పరీక్ష రాపిస్తే వెయ్యి రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఒక్కో పద్ధతికి ఒక్కో రేటు పెట్టి అందినకాడికి దండుకుంటున్నారు. పరీక్ష ప్రారంభం కాగానే, మెయిన్ గెటుకు తాళం వేస్తారు… ఎగ్జామ్ హాళ్లలో తమ ఇష్టానుసారంగా మాస్ కాపీయింగ్ చేయిస్తున్నారు నిర్వాహకులు. కాగా, కడప జిల్లా వ్యాప్తంగా వివిధ కాలేజీలో మాస్ కాపీయింగ్ చేయిస్తున్న కాలేజీలపై నాగార్జున యూనివర్సిటీ అధికారులు చర్యలు తీసుకోవాలని మెరిట్ స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.
previous post