దేశీయ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ ‘ఎర్టిగా టూర్ ఎం’ పేరుతో సరికొత్త మోడల్ ను విడుదల చేసింది. ఈ కారులో 1.5లీటర్ డీజిల్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ కారు దిల్లీ ఎక్స్‌షోరూమ్ ధర రూ.9.81 లక్షలు. ముఖ్యంగా క్యాబ్ నిర్వాహకులే లక్ష్యంగా దీనిని తయారు చేశారు. ఈ ఏడాది మొదట్లో ఎర్టిగా టూర్ పెట్రోల్, సీఎన్‌జీ వెర్షన్‌లను మార్కెట్లోకి విడుదల చేశారు. కొత్తగా వచ్చిన ఎర్టిగా టూర్ ఎం డీజిల్ కారు 94 బీహెచ్‌పీ శక్తిని, 225 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. దీనిలో 6 స్పీడ్ మాన్యూవల్ గేర్‌బాక్స్‌ను ఇచ్చారు.
ఈ కారు ఏఆర్‌ఏఐ లెక్కల ప్రకారం లీటర్‌కు 24.2 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఎర్టిగా వీఎక్స్‌ఐ మోడల్ ఆధారంగా ఈ సరికొత్త కారును అభివృద్ధి చేశారు. ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, క్రోమ్ గ్రిల్, 3డీ ఎల్‌ఈడీ టెయిల్ గేట్, బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, ఎలక్ట్రికల్లీ అడ్జెస్టెడ్ ఓఆర్‌ఎం, 15 అంగుళాల అలాయ్ వీల్స్, కీలెస్ ఎంట్రీ, క్యాబిన్‌లోని మూడు వరుసల్లో పవర్ విండో, ఆడియో కంట్రోల్స్‌తో టిల్ట్ స్టీరింగ్, వెనుక సీట్లకు ఏసీ వెంట్, 2 డీఐఎన్ ఆడియో, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లను ఇచ్చారు.