వివాహ వేడుకల్లో జరిగిన ఓ చిన్న గొడవలో ప్రమాదవశాత్తు ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. భర్త ప్రాణాలను రక్షించే క్రమంలో తూటాలకు బలైంది. పోలీసుల కథనం ప్రకారం.. అవుటర్ ఢిల్లీలోని మంగోల్‌పురి ప్రాంతంలో జరుగుతున్న తన మేనల్లుడి వివాహానికి సునీత అనే మహిళ తన భర్త సజ్జన్‌తో కలిసి హాజరైంది. పెళ్లిలో సజ్జన్‌కు, అన్నదమ్ములైన ఆకాశ్, సందీప్‌తో చిన్నపాటి గొడవ మొదలైంది.
అది క్షణాల్లోనే పెద్దగా మారడంతో ఆగ్రహం పట్టలేని ఆకాశ్, సందీప్‌లు తుపాకి తీసి సజ్జన్‌కు గురిపెట్టి కాల్చారు. పక్కనే ఉన్న భార్య భర్తను రక్షించే ప్రయత్నంలో అడ్డం వెళ్లింది. దీంతో తూటాలు ఆమె శరీరంలోకి దూసుకెళ్లినట్టు డీసీపీ సెజు కురువిల్లా తెలిపారు. రక్తపు మడుగులో కుప్పకూలిన సునీతను వెంటనే జైపూర్ గోల్డెన్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సునీత పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.