కాంగ్రెస్ మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మళ్లీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పంపించాలని నిర్ణయించింది. రాజస్థాన్ బీజేపీ నేత, రాజ్యసభ్యుడు మదన్‌లాల్ సైనీ మరణించడంతో ఆ పదవికి ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ స్థానానికి డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను అభ్యర్థిగా నిలపాలని కాంగ్రెస్ నిర్ణయించింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యత్వం జూన్‌లో ముగిసింది. ఆయన 28 సంవత్సరాలపాటు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. ఆయన అస్సాం నుంచి రాజ్యసభకు ఎన్నికవుతూ ఉండేవారు. మదన్ లాల్ సైనీ గత సంవత్సరమే రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి ఆ పార్టీ అభ్యర్థి రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఈ పదవికి జరిగే ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 7న విడుదలవుతుంది, ఎన్నిక ఈ నెల 26న జరుగుతుంది, ఫలితాలు అదే రోజు ప్రకటిస్తారు.
మన్మోహన్ సింగ్ కు నడిచే ఆర్థిక వ్యవస్థ అనే పేరుకూడా ఉంది. ఎంతో మంది యువ నేతలకు రాజకీయ అడుగులు నేర్పిన పొలిటికల్ ప్రొఫెసర్ ఆయన. భారత్ ను ప్రపంచ దేశాలతో పోటీ పడేలా తన సరళీకృత ఆర్ధిక విధానాలు రూపొందించిన నేత. ఎనభై ఐదు సంవత్పరాల వయస్సు వచ్చినా ఇప్పటికి ఆయన పనితీరులో వేగం, స్పష్టత ఏమాత్రం తగ్గలేదు. పదేళ్ళు యుపిఏ సర్కార్ లో ప్రధానిగా, అంతకుముందు మాజీ ప్రధాని పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్దికమంత్రిగా సేవలందించిన మౌన ముని మన్మోహన్ సింగ్ రాజ్యసభ పదవీకాలం ముగిసింది. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న రాజకీయాల దృష్ట్యా ఆయనకు మళ్లీ రాజ్యసభ సభ్యత్వం ఇచ్చే అవకాశాలేవని అప్పట్లో చర్చ కూడా జరిగింది. అనూహ్యంగా రాజస్థాన్ నుండి రాజ్యసభ రేసులో ఉండడం పలు రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.