telugu navyamedia
సినిమా వార్తలు

“మణికర్ణిక : ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ” మా వ్యూ

manikarnika

బ్యానర్ : జీ స్టూడియోస్‌
నటీనటులు : కంగనా రనౌత్‌, అంకితా లోఖండే, అతుల్‌ కులకర్ణి, జిషు సేన్‌గుప్తా, సురేశ్‌ ఒబేరాయ్‌, డానీ డెంగోజాపా
దర్శకత్వం : క్రిష్‌ జాగర్లమూడి, కంగనా రనౌత్‌
సంగీతం : శంకర్‌-ఇసాన్‌-లాయ్‌
సినిమాటోగ్రాఫీ : కిరణ్‌ డియోహన్స్‌, జ్ఞానశేఖర్‌. వి.ఎస్‌
కథ : కె.వి. విజయేంద్ర ప్రసాద్‌
ఎడిటింగ్‌: రామేశ్వర్‌ భగత్‌, సూరజ్‌ జగ్తప్‌
నిర్మాతలు : కమల్‌ జైన్‌, నిశాంత్‌ పిట్టి

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ నాయికా ప్రాధాన్యమున్న కథల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఝాన్సీరాణి లక్ష్మీబాయి జీవితకథ ఆధారంగా కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చారిత్రాత్మక చిత్రం “మణికర్ణిక”. ఈ సినిమాకి క్రిష్ దర్శకుడిగా వ్యవహరించి ఆ తరువాత తప్పుకున్నారు. దీంతో కంగనానే దర్శకత్వ బాధ్యతలు చేపట్టి ఈ చిత్రాన్ని పూర్తి చేసింది. సినిమా మొదలైనప్పట్నుంచి ఎన్నో వివాదాల్లో చిక్కుకుంది. దర్శకుడు క్రిష్ సినిమా చిత్రీకరణ మధ్యలో తప్పుకోవడం, ఆ తరువాత సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్న సోనూసూద్ దాదాపు చిత్రీకరణ పూర్తయిన సమయంలో తప్పుకోవడం, ఆ తరువాత సినిమా విడుదల సమయంలో చరిత్రను వక్రీకరిస్తున్నారంటూ కర్ణిసేన వివాదం లేవనెత్తడం… ఈ వివాదాలన్నింటినీ దాటుకుని ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన “మణికర్ణిక” ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుందో చూద్దాం.

కథ :
బెనారస్ లోని బిత్తోర్ లో పుట్టిన మణికర్ణిక (కంగనా రనౌత్) చిన్నప్పటినుంచే యుద్ధ విద్యలన్నింటిలో ఆరితేరుతుంది. పెళ్ళీడుకొచ్చిన మణికర్ణికను ఝాన్సీ రాజ్య చక్రవర్తి గంగాధర్ రావు (జిషుసేన్ గుప్తా)కు ఇచ్చి వివాహం చేస్తారు. పెళ్ళి తరువాత మణికర్ణిక పేరును లక్ష్మీబాయిగా మారుస్తారు. పెళ్ళి చేసుకొని ఝాన్సీ రాజ్యానికి వెళ్ళిన మణికర్ణిక అక్కడి రాజ్యంలోని ప్రజలతో మమేకమై ఝాన్సీకి తగిన రాణిగా పేరు తెచ్చుకుంటుంది. ఆ సమయంలోనే ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో విస్తరిస్తుంటుంది. ఝాన్సీ రాజ్యాన్ని తమ హస్తగతం చేసుకోవడానికి బ్రిటిష్ పాలకులు చేస్తున్న ప్రయత్నాలను ఝాన్సీరాణి లక్ష్మీబాయి తిప్పికొడుతోంది. వారితో చర్చలకు కూడా తావివ్వదు. దీంతో ఝాన్సీని ఎలాగైనా తమ ఆధీనంలోని తెచ్చుకోవడానికి బ్రిటిష్ పాలకులు ఏం చేశారు ? ఈ క్రమంలో లక్ష్మీబాయి ఎలాంటి సమస్యలను ఎదుర్కొంది ? ఆ సమస్యల నుంచి ఝాన్సీని, తన ప్రజలను లక్ష్మీబాయి ఎలా కాపాడుకుంది ? తన రాజ్య స్వాతంత్య్రం కోసం లక్ష్మీబాయి ఏ విధంగా పోరాడింది ? అనేది వెండితెరపై వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు :
ఝాన్సీ రాణి లక్ష్మీబాయి పాత్రలో కంగనా రనౌత్‌ జీవించేసింది. ఈ చిత్రంతో తన నట విశ్వరూపం చూపించింది. మణికర్ణికగా యుక్తవయసులో చిరునవ్వుతో ఆనందంగా గడపడం, లక్ష్మిబాయిగా రణరంగంలో కత్తి దూస్తూ రౌద్ర రూపం దాల్చడం వరకు ఆమె జీవితంలో ఎన్ని పార్శ్వాలు ఉన్నాయో వాటన్నిటినీ కంగనా కళ్ళకు కట్టినట్టుగా చూపించింది. ఈ చిత్రం కంగనానకు ఉత్తమనటిగా నేషనల్ అవార్డు రావడం ఖాయం. లక్ష్మీబాయి భర్త గంగాధర్‌రావు పాత్రలో జిషు సేన్‌గుప్తా, గౌస్‌ఖాన్‌ పాత్రలో డానీ డెంగోజపా, ఝల్కరీబాయి పాత్రలో అంకితా లోఖండే ఇతర నటీనటులు పాత్రల్లో ఒదిగిపోయి ప్రేక్షకులను మెప్పిస్తారు.

సాంకేతిక వర్గం పనితీరు :
ప్రథమార్ధంలో చిన్నతనం నుంచి మణికర్ణిక ఎదిగిన విధానం, ఆమె ధైర్యసాహసాలు, వివాహం అనంతరం ఝాన్సీలో ఆమె జీవితం ఎలా ఉండేది అనే విషయాన్నీ చూపించారు. ద్వితీయార్ధంలోలో ఝాన్సీని వశం చేసుకునేందుకు బ్రిటీష్ పాలకులు వేసే ఎత్తులు, యుద్ధం సమయంలో లక్ష్మీబాయి విరోచిత పోరాటం, ఝాన్సీ కుటుంబం అంతర్గతంగా ఎదుర్కొన్న ఇబ్బందులు, మీరట్‌ సిపాయి తిరుగుబాటు సహా 1800 కాలంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలను కథలో భాగం చేసి సినిమాను ఆసక్తికరంగా మలిచారు దర్శకులు క్రిష్‌ జాగర్లమూడి, కంగనా రనౌత్‌. సినిమా ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. కానీ కొన్ని చోట్ల అనవసరమైన విజువల్‌ ఎఫెక్ట్స్‌ సినిమాకు మైనస్. సినిమాటోగ్రాఫీ ప్రేక్షకుడిని ఆ కాలంలోకి తీసుకెళ్తుంది. సంగీతం ఫరవాలేదు. పాటలు అంతగా ఆకట్టుకోలేవు… అయితే నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

రేటింగ్ : 3.5/5

Related posts