‘మా’ అధ్యక్షుడు, సినీ నటుడు మంచు విష్ణు కార్యాలయంలో చోరీ జరిగింది. రూ. 5 లక్షల విలువ చేసే హెయిర్ డ్రెస్ సామాగ్రిని హెయిర్ స్టైలిస్ట్ నాగ శ్రీను అనే వ్యక్తి దొంగతనం చేసినట్లు తెలుపుతూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో మంచు విష్ణు మేనేజర్ కేసు నమోదు చేశారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలోనే హెయిర్ స్టైలిస్ట్ నాగ శ్రీను పంపిన ఒక సెల్ఫీ వీడియోలో మాట్లాడుతూ.. తాను ఎటువంటి దొంగతనం చేయలేదని, మంచు ఫ్యామిలీనే తన మీద లేనిపోని అభాండాలు వేస్తుందని తెలిపాడు. ” మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి నన్ను చిత్ర హింసలు పెట్టి చెప్పుకోలేని విధంగా బూతులు తిట్టి, కులం పేరుతో అవమానించిన కారణంగా నేను ఉద్యోగం మానేశాను. అలా మానేసినందుకు 5 లక్షల విలువ చేసే హెయిర్ డ్రెస్సింగ్ సామగ్రి చోరీ అని నా మీద అక్రమంగా కేసు పెట్టారని అన్నారు.
మోహన్ బాబు నన్ను తిట్టడం, నన్ను మోకాళ్ళ మీద కూర్చోపెట్టి కొట్టడం అక్కడ ఉన్న సీసీటీవీ లో రికార్డ్ అయ్యింది. ఇదంతా ఫిబ్రవరి 17 న మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ సంఘటన జరిగింది. నాపై లేనిపోని కేసులు పెట్టడంతో ఆ విషయం విని నా తల్లి కి గుండె నొప్పి వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యింది. 10 ఏళ్లుగా మోహన్ బాబు వద్ద నమ్మకంగా పనిచేస్తున్నాను. నాపై ఇలాంటి నిందలు వేయడం మీకు భావ్యం కాదు.
విష్ణు బాబు నాపై అనవసరంగా కేసు పెట్టించారు. వారు అన్న బూతులు నేను మీకు చెప్పలేను. ఆ మాటలు పడలేకే నేను ఉద్యోగం మానేశాను. నాలాంటి చిన్నవారి జీవితాలతో ఆడు కోవడం మీలాంటి పెద్దవాళ్లకు తగదు. దయచేసి నన్ను వదిలేయండి. ఈ వీడియో చూసిన పెద్దలు, మీడియావారు నాకు న్యాయం చేయండి. ” అంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.