మంచు విష్ణు ‘మోసగాళ్లు’ అనే హాలీవుడ్-ఇండియన్ సినిమా చేస్తున్న విషయం విదితమే. ఈ చిత్రం కోసం ఆయన కూకట్‌పల్లిలో సుమారు రూ. 3.5 కోట్ల వ్యయంతో ఒక భారీ ఐటీ ఆఫీస్ సెట్‌ను నిర్మించారు ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంతో రూపొందుతున్న ‘మోసగాళ్లు’ సినిమా షూటింగ్ 2019 మొదట్లో ఆరంభమైంది. లాస్ ఏంజెల్స్, హైదరాబాద్ ప్రాంతాల మధ్య వేగంగా చిత్రీకరణ జరుపుకుంటూ వస్తున్న ‘మోసగాళ్లు’ చిత్రం.. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధ చర్యల్లో భాగంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో పూర్తిగా ఆగిపోయింది. ఈ షెడ్యూల్‌లో విష్ణుతో పాటు కాజల్ అగర్వాల్, బాలీవుడ్ స్టార్ యాక్టర్ సునీల్ శెట్టి తదితరులు పాల్గొనగా ప్రధాన సన్నివేశాలు, క్లైమాక్స్ యాక్షన్ సీన్లు దాదాపు పూర్తయ్యాయి. అయితే, చిత్రానికి అతి కీలకమైన ఐటీ ఆఫీస్ సన్నివేశాల చిత్రీకరణ లాక్‌డౌన్ కారణంగా నిరవధికంగా ఆగిపోయింది. ‘మోసగాళ్లు’ చిత్రీకరణ ఆగిపోయిన విషయం చిత్ర బృందం ధ్రువీకరిస్తూ, ప్రతి యూనిట్ మెంబర్ క్షేమం దృష్ట్యా చిత్రీకరణ నిలిపివేశామని, ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితి మెరుగై, సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాక చిత్రీకరణ కొనసాగిస్తామని తెలిపింది. హాలీవుడ్‌కు చెందిన జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్న ‘మోసగాళ్లు’ సినిమాలో మంచు విష్ణు, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, నవదీప్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది వేసవిలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, కరోనా వైరస్ ప్రభావంతో టాలీవుడ్‌లో సినిమా షూటింగ్‌లన్నీ వారం రోజుల క్రితమే ఆగిపోయాయి. కానీ, ‘మోసగాళ్లు’ సినిమా షూటింగ్ ఆగిపోయినట్టు ఇప్పుడు ప్రకటించడం ఆశ్చర్యంగా ఉంది.