తెలంగాణ సీఎం కేసీఆర్ పై సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క విమర్శలు గుప్పించారు. కరోనాను కట్టడి చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో సచివాలయం ఉందో, లేదో కూడా తెలియని పరిస్థితి ఉందని భట్టి మండిపడ్డారు. సచివాలయంలో ఏం జరుగుతోందో కూడా తెలియని పరిస్థితి ఉందని అన్నారు. రాష్ట్రంలో కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయని అన్నారు.
కరోనా నివారణ చర్యలపై ప్రభుత్వం చేతులెత్తేసిందని చెప్పారు. కరోనా వైరస్ కారణంగా వైద్యులు, జర్నలిస్టులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఫామ్ హౌస్, ప్రగతి భవన్ లో కేసీఆర్ బాగానే ఉన్నారని అన్నారు. సామాన్య, పేద ప్రజల పరిస్థితి ఏమిటనిఆయన ప్రశ్నించారు.ఏది తోస్తే అది చేయడం కేసీఆర్ కు అలవాటైందని విమర్శించారు. మూడు నెలల విద్యుత్ బిల్లులను ఒకే సారి వసూలు చేస్తూ పేదలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు. ఈనెల 11న కాంగ్రెస్ నేతృత్వంలో ఛలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు.