telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“మల్లేశం” మా వ్యూ

Mallesham

బ్యానర్ : సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్‌, స్టూడియో 99
న‌టీన‌టులు: ప్రియ‌ద‌ర్శి, అన‌న్య‌, ఝాన్సీ, చ‌క్ర‌పాణి, తాగుబోతు ర‌మేశ్ త‌దిత‌రులు
ద‌ర్శ‌క‌త్వం: రాజ్‌.ఆర్‌
సినిమాటోగ్ర‌ఫీ: బాలు శాండిల్య‌స‌
సంగీతం : మార్క్ కె.రాబిన్‌
నిర్మాత‌లు: రాజ్‌.ఆర్‌, శ్రీఅధికారి

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా నడుస్తోంది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన చింత‌కింది మ‌ల్లేశం జీవితగాధ ఆధారంగా తెరకెక్కిన చిత్రం “మల్లేశం”. చేనేత రంగంలో మ‌ల్లేశం చేసిన కృషికి భార‌త ప్ర‌భుత్వం ఆయ‌న‌కు ప‌ద్మ‌శ్రీ అవార్డును ఇచ్చి స‌త్క‌రించడమే కాకుండా చేనేత ప‌రిశ్ర‌మ అభివృద్ధిలో భాగంగా తెలంగాణ ప్ర‌భుత్వం కూడా చేనేత యూనిట్ డెవ‌ల‌ప్‌మెంట్ కోసం మ‌ల్లేశంకు కోటి రూపాయ‌ల‌ను ప్ర‌క‌టించింది. ఇప్పటి వరకు కమెడియన్ గా మెప్పించిన ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుందో చూద్దాం.

కథ :
చింతకింద మల్లేశం తల్లిదండ్రులు (చక్రపాణి, ఝాన్సీ) ఎన్నో సమస్యల మధ్య చేనేత పని చేస్తూ బ్రతుకుతుంటారు. ఈ నేపథ్యంలోనే వారికి అప్పుల బాధ ఎక్కువ కావడంతో మల్లేశంకు 6వ తరగతిలోనే చదువు మాన్పించి, చేనేత పని నేర్పిస్తాడు తండ్రి. ఆ విధంగా తండ్రికి మల్లేశం సహాయం చేస్తుండగా… ఆసును అమరుస్తూ భర్త, కొడుకుకు సహాయం చేస్తుంది మల్లేశం తల్లి. ఈ క్రమంలో ఆమె చేతి ఎముక విరిగి బాధపడుతుంది. ఆమె బాధను చుసిన మల్లేశం ఆశు యంత్రాన్ని కనిపెట్టడానికి ప్రయత్నిస్తాడు. ఎప్పుడూ ఆసు యంత్రాన్ని తయారు చేసే ధ్యాసలోనే ఉండే మల్లేశంను చూసి స్నేహితులు, ఊళ్ళో వాళ్ళు ఎగతాళి చేస్తుంటారు. అంతేకాదు మల్లేశంకు పెళ్ళి చేసేయమని అతని తల్లిదండ్రులకు సలహా ఇస్తారు. దీంతో వారు మల్లేశం ఎంతగానో ఇష్టపడే మేనమామ కూతురు పద్మ (అనన్య)తో వివాహం జరిపిస్తారు. భర్త ఆలోచన తెలుసుకున్న పద్మ… మల్లేశంకు తనవంతు ప్రోత్సాహం అందిస్తుంది. అయితే ఓ సందర్భంగా భార్యాభర్తల మధ్య గొడవ రావడంతో మల్లేశం ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. తరువాత భార్యతో కలిసి పట్నం దారి పడతాడు. అతనికి పట్నంలో ఎదురైన పరిస్థితులేంటి ? మరి మల్లేశం ఆసు యంత్రాన్ని ఎలా కనుగొన్నాడు ? అనే విషయం తెలియాలంటే సినిమాను వెండితెరపై వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు :
తెలంగాణ యాసలో డైలాగులు పేలుస్తూ మంచి టైమింగ్ తో క‌మెడియ‌న్‌గా పేరు తెచ్చుకున్న ప్రియ‌ద‌ర్శి ఈ సినిమాలో మల్లేశం పాత్రలో నటించాడు. మ‌ల్లేశం పాత్ర‌లో ప్రియ‌ద‌ర్శి ఒదిగిపోయాడు. తెలంగాణ యాస‌లో డైలాగ్స్ చెప్ప‌డం, ఎమోష‌న‌ల్ సీన్స్‌లో న‌టించ‌డం, ఆసు యంత్రాన్ని కనుగొన‌డంలో ప‌డే తాప‌త్ర‌యం లాంటి అన్ని భావాలతో ప్రియ‌ద‌ర్శి న‌ట‌న ప్రేక్షకులను ఆక‌ట్టుకుంటుంది. ఇక మ‌ల్లేశం భార్య ప‌ద్మ పాత్ర‌లో నటించిన అన‌న్యకు ఇదే మొదటి సినిమా. అయినప్పటికీ చాలా చ‌క్క‌టి నటన కనబరిచింది. ఇక తండ్రి పాత్ర‌లో న‌టించిన చ‌క్ర‌పాణి, త‌ల్లి పాత్ర‌లో న‌టించిన ఝాన్సీ తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారు. ఇక‌పై ఝాన్సీ ఖచ్చితంగా త‌ల్లి పాత్ర‌లతో బిజీ అవుతుంది. మిగిలిన పాత్ర‌ధారులు వారి వారి పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతిక వర్గం పనితీరు :
దర్శకుడు రాజ్‌.ఆర్‌. ఈ సినిమాను సరైన నటీనటులను ఎంచుకోవడంతోనే స‌క్సెస్ సాధించాడు. సినిమాలో ఓ వైపు ఓ వ్య‌క్తి ప్ర‌యాణాన్ని వివ‌రిస్తూనే, చేనేత కార్మికులు ప‌డే క‌ష్ట‌న‌ష్టాల‌ను హృదయానికి హత్తుకునేలా తెర‌కెక్కించారు. మంచి ఎమోష‌న్స్‌తో చెప్పాల‌నుకున్న క‌థ‌ను చెబితే చాలు కమర్షియల్ హంగులు అక్కర్లేదని ఈ సినిమాతో నిరూపించాడు దర్శకుడు. తెలంగాణ పల్లె పాటలతో పాటు మంచి నేప‌థ్య సంగీతాన్ని అందించాడు మార్క్ కె.రాబిన్‌. కౌండిల్యస కెమెరా ప‌నితం చాలా బావుంది. పెద్దింటి అశోక్ కుమార్ డైలాగ్స్ చాలా బావున్నాయి. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా ఉన్నాయి. సినిమా థియేటర్లో ప్రతి ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Related posts