నాగచైతన్య, సమంత పెళ్లి తర్వాత జంటగా తొలిసారి స్ర్కీన్ షేర్ చేసుకుంటున్న సినిమా “మజిలీ”. శివనిర్వాణ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాణంలో రూపొందిన “మజిలీ” చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రంలో సమంతతో పాటు దివ్యాన్ష కౌశిక్ మరో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ లో జోరు పెంచారు చిత్రబృందం. ఇప్పటికే సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని “యూ/ఏ” సర్టిఫికేట్ పొందిన విషయం తెలిసిందే. 2 గంటల 34 నిమిషాల నిడివితో ఈ సినిమా ప్రదర్శితం కానుందని సమాచారం. అయితే నిడివి కొంచం ఎక్కువగానే ఉన్నప్పటికీ సినిమాలోని ఎమోషన్ తో ప్రేక్షకులు కనెక్ట్ అవుతారనే నమ్మకంతో ఉన్నారట దర్శకనిర్మాతలు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా కోసం 200 థియేటర్లను కేటాయించినట్టుగా సమాచారం. పెళ్ళి తరువాత చైతూ, సమంత కలిసి చేస్తున్న మొదటి సినిమా కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలకు, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనలభించింది. ఇక ప్రస్తుతం పెద్ద సినిమాలేవీ లేకపోవడం, “ఉగాది” పండుగ కావడం, ఈ శనివారం సెలవు రోజు కావడం ఈ సినిమాకి కలిసొచ్చే అంశాలని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక “మజిలీ” చిత్రాన్ని కేరళలో ఇండీవుడ్ డిస్ట్రిబ్యూషన్స్ నెట్వర్క్ ద్వారా ప్రత్యేకంగా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో విడుదల చేయనున్నారు.