బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గత నెల 14న తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడటం పలు అనుమానాలకు తావిచ్చింది. ఇది ఆత్మహత్య కాదు హత్య అని సుశాంత్ సన్నిహిత వర్గాలు ఆరోపించినప్పటికీ.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఆత్మహత్య అని తేలడంతో.. ఎంతో కెరీర్ ఉన్న అతను ఇలా సూసైడ్ చేసుకోవడానికి కారణాలేంటి? అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ మిస్టరీ చెందించే దిశగా ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ, ఆదిత్యా చోప్రా, సినిమా క్రిటిక్ రాజీవ్ మసంద్, సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి సహా ఇప్పటి వరకు 37 మందిని విచారించారు. ఇక ఇప్పుడు ప్రముఖ దర్శకనిర్మాత మహేశ్ భట్ వాంగ్మూలాన్ని కూడా తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు విషయమై మరో రెండు రోజుల్లో మహేశ్ భట్‌ని కూడా పోలీసులు విచారించనున్నట్లు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ వెల్లడించారు. ఆయనతో పాటు కరణ్ జోహర్ మేనేజర్ ను విచారణకు పిలిచినట్లు ఆయన తెలిపారు. మరోవైపు సుశాంత్ మరణంపై సంచలన వ్యాఖ్యలు చేస్తోన్న నటి కంగనా రనౌత్ కు కూడా సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ విచారణలో ఎలాంటి విషయాలు బయటకొస్తాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.