telugu navyamedia
సినిమా వార్తలు

అప్పుడు వాళ్ళు.. ఇప్పుడు నేనూ కాలర్ ఎగరేస్తున్నాను : మహేష్

Mahesh-Babu

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన సినిమా ‘మహర్షి’. పూజా హెగ్డే హీరోయిన్‌. సి. అశ్వనీదత్‌, ‘దిల్‌’ రాజు, పీవీపీ నిర్మాతలు. దేవీశ్రీ ప్రసాద్‌ స్వరకర్త. ఆదివారం సక్సె్‌సమీట్‌ నిర్వహించారు.

మహేశ్‌బాబు మాట్లాడుతూ ‘‘ ఆదివారం మదర్స్‌ డే. నాకు అమ్మంటే దేవుడితో సమానం. ఎప్పుడూ సినిమా విడుదలకు ముందు అమ్మ దగ్గరకు వెళ్ళి కాఫీ తాగుతా. ఆ కాఫీ తాగితే నాకు దేవుడి గుడిలో ప్రసాదం తిన్నట్టుంటుంది. అమ్మ ఆశీస్సులు నాకు చాలా ముఖ్యం. ఆ ఆశీస్సుల వల్లే ఈ విజయం వచ్చిందని అనుకుంటున్నా.ఈ విజయాన్ని అమ్మలందరికీ అంకితం ఇస్తున్నా. మా టీమ్‌ అందరికీ థ్యాంక్స్‌… నా 25 చిత్రాల ప్రయాణం ఎంతో ప్రత్యేకం. అందులో “మహర్షి” మరింత ప్రత్యేకం. నా కెరీర్‌ బిగ్గెస్ట్‌ హిట్స్‌ని ఒక వారంలో దాటేయబోతున్నాం. దీనికి మించిన ఆనందం నాకు లేదు. ప్రీ రిలీజ్‌ వేడుకలో నాన్నగారి అభిమానులు, నా అభిమానులు కాలర్‌ ఎత్తుకుని తిరుగుతారని వంశీ పైడిపల్లి అన్నాడు. వంశీ… వాళ్ళు కాలర్‌ ఎత్తారు. ఈ రోజు నేనూ కాలర్‌ ఎత్తాను” అన్నారు మహేశ్‌బాబు.

“కృష్ణగారి సూపర్‌హిట్స్‌ అన్నీ రైతు నేపథ్యంలో వచ్చినవే. ఆయన్ని కలవడానికి వెళ్ళినప్పుడు, నాగరత్నమ్మగారు (కృష్ణ తల్లి) రైతు కష్టాల గురించి చెప్పేవారు. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన మహేశ్‌.. రైతు నేపథ్యంలో తన 25వ సినిమా చేయడం, వసూళ్ళు చరిత్ర సృష్టిస్తుండటం సంతోషం. దీనికి మహేశ్‌, దర్శకుడు వంశీ కారణం. మే 9కి విడుదల చేసిన నా 3 సినిమాలు (జగదేకవీరుడు అతిలోక సుందరి, మహానటి, మహర్షి) తెలుగు పరిశ్రమకు ఎంతో గౌరవాన్ని తీసుకొచ్చాయి. వాళ్ళ చరిత్రలో మిగిలాయి. అందుకు నేను గర్వపడుతున్నా’’ అని అశ్వనీదత్‌ అన్నారు.

‘‘వంశీ కథ చెప్పినప్పుడు ఒక క్లాసిక్‌ అవుతుందని మహేశ్‌గారు, నేను, మా టీమ్‌ అంతా నమ్మాం. ఆ నమ్మకం నిజమవుతున్నందుకు గర్వంగా ఉంది’’ అని ‘దిల్‌’ రాజు అన్నారు.

‘‘సాధారణంగా నేను కామెడీ చేస్తాను. నేను సీరియస్‌ క్యారెక్టర్‌ చేయగలనని నమ్మినందుకు మహేశ్‌గారికి, వంశీకి థ్యాంక్స్‌. మహేశ్‌ పర్‌ఫెక్షనిస్ట్‌. ఆయనతో నటించడం గొప్ప అనుభవం. మా నాన్నగారు (ఈవీవీ) దర్శకుడి కంటే ముందు రైతు. ఆయన “మహర్షి”ని చూస్తే రైతుగా గర్వపడేవారు. మనం ఎన్ని సినిమాలు చేసినా… కొన్ని మాత్రమే గౌరవాన్ని తీసుకొస్తాయి. అటువంటి చిత్రమిది’’ అని ‘అల్లరి’ నరేశ్‌ అన్నారు.

“మా తల్లిదండ్రులు సినిమా చూసి నన్ను హత్తుకున్నారు. అంతకు మించిన విజయాన్ని నేను అడగలేను. రైతులపై కాదు… మనపై మనం సానుభూతి చూపించుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పిన చిత్రమిది. రైతు సమస్యలకు పరిష్కరాన్ని చూపించిన చిత్రమిది. ఎకరం పొలం కొనుక్కోవాలని ప్రజల్లో ఆలోచన రేకెత్తించిన చిత్రమిది’’ అని వంశీ పైడిపల్లి అన్నారు. ఈ కార్యక్రమంలో దేవిశ్రీ ప్రసాద్‌, పాటల రచయిత శ్రీమణి, నటులు రాజీవ్‌ కనకాల, కమల్‌ కామరాజు, శ్రీనివాసరెడ్డి, రచయిత హరి తదితరులు పాల్గొన్నారు.

Related posts