telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“మహారాష్ట్ర” మలుపులను 1981లోనే ఊహించిన కమల్…!!

Kamal-Hassan

అనూహ్య మలుపులు తిరిగిన మహారాష్ట్ర రాజకీయాలు మంగళవారం నాటికి ఓ కొలిక్కి వచ్చాయి. ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీలేవీ ముందుకు రాకపోవడంతో.. అసెంబ్లీ పదవీ కాలం ముగుస్తుందనగా… ఫడ్నవీస్ రాజీనామా చేయడం.. ఆ తర్వాత రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధపడుతున్న వేళ.. గవర్నర్ హడావిడిగా రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయడంతో అనుమానాలు తలెత్తాయి. ఉద్దవ్ థాక్రేను సీఎం అభ్యర్థిగా శరద్ పవార్ ప్రకటించిన తర్వాత… మరుసటి రోజు మూడు పార్టీలు కలిసి గవర్నర్‌ను కలవాలని నిర్ణయించాయి. కానీ తెల్లవారే సరికే రాజకీయం మారిపోయింది. ఎన్సీపీ శాసనసభా పక్ష నేత అజిత్ పవార్ మద్దతుతో దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి సీఎంగా ప్రమాణం చేశారు. అజిత్ డిప్యూటీ సీఎం అయ్యారు. విపక్షాలు సుప్రీం మెట్లెక్కడంతో బలనిరూపణ చేసుకోవాలని ఫడ్నవీస్ సర్కారును అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. సంఖ్యా బలం లేకపోవడంతో అజిత్ పవార్, ఫడ్నవీస్ తమ పదవులకు రాజీనామా చేశారు. ఆ తర్వాత ఉద్ధవ్ థాక్రేను సీఎం అభ్యర్థిగా ఎన్నుకున్న మూడు పార్టీలు గవర్నర్‌ను కలిశాయి. మరాఠా రాజకీయాల్లో ఇన్ని మలుపులను ఎవరూ ఊహించి ఉండరు. కానీ 1981లోనే కమల్ హాసన్ ఊహించరంటున్నారు నెటిజన్లు. ఆకలి రాజ్యం సినిమాలో ఇంటర్వ్యూకు వెళ్లిన కమల్ హాసన్‌కు మహారాష్ట్ర సీఎం ఎవరు అనే ప్రశ్న ఎదురవుతుంది. దీనికి ఆయన బదులిస్తూ.. ఈ రోజా? నిన్నా? మొన్నా? ఎందుకంటే అక్కడ రోజుకొకరు మారుతున్నారని బదులిస్తాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్టోబర్ 23న ఫడ్నవీస్ సీఎం కాగా.. అంతకు ముందు రాష్ట్రపతి పాలన విధించారు. ఉద్ధవ్ థాక్రే సీఎంగా ప్రమాణం చేయబోతున్నారు. దీంతో కమల్ మహరాష్ట్ర రాజకీయాలను 39 ఏళ్ల క్రితమే ఊహించాడని నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు. ఆకలి రాజ్యంలో కమల్ హాసన్ అలా చెప్పడానికి కారణం లేకపోలేదు. అప్పుడు మహారాష్ట్రలోనే కాదు చాలా రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రుల మార్పు అనేది చాలా సాధారణంగా ఉండేది.

Related posts