telugu navyamedia
రాజకీయ

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం: రెబల్ ఎమ్మెల్యేలకు సుప్రీం కోర్టులో ఊరట.. మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు

సుప్రీంకో​ర్టులో శివసేన రెబల్‌ ఎమ్మెల్యేలకు భారీ ఊరట లభించింది. ఏక్‌నాథ్‌ షిండేతో సహా 16 మంది ఎమ్మెల్యేలపై మహారాష్ట్ర డిప్యూడీ స్పీకర్‌ ఇచ్చిన అనర్హత పిటిషన్లపై జూలై 11 వరకూ ఎలాంటి చర్యలూ చేపట్టవద్దని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది.

రెబల్​ ఎమ్మెల్యేల వర్గంలోని మొత్తం 39 మందితో పాటు వారి కుటుంబసభ్యులు, ఇళ్లు, ఆస్తులకు రక్షణ కల్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అనర్హత నోటీసులపై శివసేన తిరుగుబాటు నేతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. శాసనసభాపక్ష నేతగా తనను తొలగిస్తూ డిప్యూటీ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై ఏక్‌నాథ్ షిండే అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పర్దివాలా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం జరిపింది.

ఈ మేరకు రెబల్‌ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది . శివసేన శాసనసభా పక్షనేత అజయ్‌ చౌదరితోపాటు డిప్యూటీ స్పీకర్‌ నోటీసులు జారీ చేసింది. అయిదు రోజుల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని మహా సర్కార్‌ను ఆదేశించింది.

జూలై 11న పిటిషన్లను తిరిగి విచారిస్తామని తెలిపింది. అప్పటి వరకూ రెబల్ ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని డిప్యూటీ స్పీకర్‌కు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసింది. వారి ఆస్తులను కాపాడేందుకు తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం ఉద్ధవ్ సర్కార్‌ను ఆదేశించింది.

అంతేకాదు.. జూన్ 27 సాయంత్రం లోపు అనర్హత నోటీసులపై సమాధానం ఇవ్వాలని రెబల్ ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన గడువును సుప్రీం కోర్టు జులై 12 వరకూ పొడిగించింది. దీంతో.. అనర్హత నోటీసుల విషయంలో రెబల్ ఎమ్మెల్యేలకు ఊరట లభించినట్టయింది.

Related posts