తమను తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేయాలంటూ మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు. సుమారు 40 గ్రామాల సర్పంచ్‌లతోపాటు అఖిలపక్ష నాయకులు ధర్మాబాద్ సమితి ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగారు. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ, శివసేన నాయకుల ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరగడం మరో విశేషం. తెలంగాణ ప్రభుత్వ పథకాలపై ఈ ప్రాంత ప్రజలకు ఆకర్షణ ఏర్పడటమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ ఊళ్లో అమ్మాయికి పెళ్లయింది. మహారాష్ట్ర సరిహద్దు గ్రామంలోని అబ్బాయికి ఇచ్చారు. పెళ్లి చేసుకున్నందుకు ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకం కింద లక్ష రూపాయలు ఇచ్చిందని వధువు తరఫు బంధువులు చెప్పారు. ఇదివిని అక్కడి వాళ్లు ఆశ్చర్యపోయారు. మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లోని రైతులకు తెలంగాణలో భూములున్నాయి. వారికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధు, రైతు బీమా పథకాలను వర్తింపజేస్తోంది. 24 గంటలూ ఉచిత కరెంటు ఇస్తోంది. మహారాష్ట్రలో ఉన్న భూములకు ఇటువంటి పథకాలేమీ లేవు… అందుకే ‘కేసీఆర్ జీ.. హమ్ భీ తెలంగాణ మే ఆజాయేంగే’ అంటూ మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలు మొర పెట్టుకుంటున్నారు.