telugu navyamedia
సినిమా వార్తలు

“నకిలీ మేధావులు మళ్ళీ సకిలించారు…” మూక దాడులపై రచయిత అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు

Anantha-Sriram

మ‌న దేశంలో దళితులు, ముస్లింలు, ఇతర మైనార్టీలపై దాడులు పెరిగిపోతున్నాయని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో విద్వేష దాడులు, మూక దాడులు, హత్యలు గణనీయంగా పెరిగాయి. మూకదాడులను వెంటనే నిరోధించాలంటూ సినీ ప్రముఖులు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ కూడా రాశారు. ఇప్ప‌టి వ‌ర‌కు 49 మంది ప్రముఖులు దీనిపై త‌మ వాద‌న‌ని వినిపించ‌గా ఇందులో ప్రముఖ దర్శకులు శ్యామ్ బెనగల్, అపర్ణాసేన్, మణిరత్నం, అనురాగ్ కశ్యప్, గాయకురాలు శుభ ముద్గల్, చరిత్రకారుడు రామచంద్ర గుహ, నటీమణులు రేవతి, కొంకణాసేన్ తదితరులు ఉన్నారు. జై శ్రీరాం అనే పేరును ఇతరులను రెచ్చగొట్టేలా ఓ రణ నినాదంగా మార్చడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. అసమ్మతి లేకపోతే ప్రజాస్వామ్య మనుగడే లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై జాతి వ్యతిరేకులు, అర్బన్ నక్సల్స్ వంటి ముద్ర వేయడం సరికాదు అని స్ప‌ష్టం చేశారు. వారి వాద‌న‌ని ప‌లువురు ఏకీభ‌విస్తుండ‌గా, ప‌లువురు వ్యతిరేకిస్తున్నారు.

తాజాగా పాటల రచయిత అనంత శ్రీరామ్‌… ప్రధాని నరేంద్రమోదీకి లేఖరాసిన 49 మంది సోకాల్డ్ ప్రముఖులను తప్పుబట్టారు. ఫేస్‌బుక్‌‌లోని తన పేజీలో ‘నకిలీ మేథావులు మళ్లీ సకిలించారు’ పేరుతో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘జై శ్రీరాం’ పదం నిషేధించమంటారా?… ‘నకిలీ మేధావులు మళ్ళీ సకిలించారు. కుహనా లౌకిక వాదులంతా కుమ్మక్కై… ప్రధానమంత్రికి ఉత్తరం రాశారట. అందులో ఏముందయ్యా అంటే… అంటూ సెటైరికల్ పోస్ట్ పెట్టారు. “జై శ్రీరాం” అన్న పదం వల్ల ఎన్నో దారుణ మారణ కాండలు జరుగుతున్నాయనీ, ఆ పదం వల్ల జరిగే దుష్పరిణామాల్ని ఆపాల్సిన బాధ్యత ప్రధానమంత్రిదేనని మేథావులు కోరడాన్ని శ్రీరామ్ తప్పుపట్టారు. “జై”, “శ్రీరాం” పదాల్ని డిక్షనరీల్లోంచీ నిషేధించమంటారా? అని ప్రశ్నించారు. మేథావుల వల్ల జైశ్రీరామ్ పదాన్ని నిషేధిస్తే… తమ లాంటి వాళ్లమంతా తమ పేర్లలోని శ్రీరామ్ పదాల్ని తొలగించుకోవాల్సి వస్తుందనీ, అందుకోసం జనన ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ సహా అన్నీ మార్చుకోవాల్సి వస్తుందని సెటైర్ వేశారు అనంత శ్రీరామ్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జైశ్రీరామ్ నినాదంపై వివాదం కొనసాగుతోంది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ… ఈ పదాన్ని ప్రయోగించడం ద్వారా… మతోన్మాదాన్ని రెచ్చగొట్టి… ఓ వర్గం ఓట్లు రాబట్టుకుందనే విమర్శలు ఉన్నాయి. బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో జైశ్రీరామ్ నినాదాల్ని వినిపించడం ద్వారా బీజేపీ హింసకు పాల్పడిందని కొందరు విమర్శించారు. అందువల్ల లౌకిక దేశంలో ఇలాంటి ప్రచారం ప్రమాదకరమని కొందరు మేధావులు అంటున్నారు. ఈ పరిస్థితుల మధ్య మేధావుల ఆలోచనను తప్పుపడుతూ అనంత శ్రీరామ్ ప్రత్యేక పోస్ట్ పెట్టడం చర్చకు దారితీసింది.

Related posts