telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఆదిలాబాద్ ‌లో పంజా విసురుతున్న చలి పులి…

ఆదిలాబాద్‌ జిల్లాలో ఒకవైపు చలి చంపేస్తుంది. మరోవైపు కరోనా టెన్షన్ పెట్టిస్తోంది. రోడ్లపై జన సంచారం అమాంతం పెరిగిపోయింది. గతంతో పోలిస్తే చలి తీవ్రత సైతం పెరిగిపోతోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. గడిచిన వారం పది రోజుల్లోనే 350కి పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రద్దీ పెరిగిపోవడంతో కరోనా కోరలు చాస్తోంది. ప్రతీ రోజు 20 నుంచి 50 పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. కేసుల తీవ్రత పెరగడానికి జనం నిర్లక్ష్యమే కారణం అంటున్నారు వైద్యులు. మంచిర్యాల జిల్లా జన్నారంలో ఈ మధ్య ఓ వివాహం జరిగింది. పెళ్లి కుమారుడు..పెళ్లి కుమార్తెకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఆ పెళ్లికి హాజరైన 12మందికి వైరస్‌ సోకింది. మరోవైపు…చలి పెరగడం వల్ల అనారోగ్య సమస్యలు ఉన్నవారికి కరోనా సోకే ప్రమాదం ఉందంటున్నారు రిమ్స్ వైద్యులు. ఇక అన్‌ లాక్‌ తో పెళ్లిళ్ల జోరు పెరిగింది. వేలాది మంది వివిధ కార్యక్రమాలకు హాజరు కావడం వల్ల కరోనా హాట్‌స్పాట్‌గా మారుతోంది. సెకండ్ వేవ్ ప్రారంభం అయిందనే చర్చా తెరపైకొచ్చింది. కొవిడ్ నిబంధనలు పాటించకుండా రోడ్లపైకొస్తే కరోనా సోకే ప్రమాదం ఉందంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే కనిష్ట ఉష్ణోగ్రతలు 9 డిగ్రీలకు పడిపోయాయి. భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. శీతల గాలుల వల్ల ఉదయం పూట రోడ్లపై మాస్కులు లేకుండా తిరిగేవారికి వైరస్ సోకుతుంది. వివిధ రకాలైన జబ్బులున్న రోగులు ఉదయం సమయంలో జర్నీ చేయొద్దంటున్నారు వైద్య నిపుణులు. ఏది ఏమైనా భౌతిక దూరం పాటించకుండా..మాస్కులు ధరించకుండా కరోనాను కట్టడి చేయటం సాధ్యం కాదు. నిర్లక్ష్యం చేస్తే వైరస్ సోకి ఇబ్బంది పడే ప్రమాదం ఉంది కాబట్టి నాదరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక అధికారులు సూచిస్తున్నారు.

Related posts