telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

దీర్ఘకాలిక .. ఆర్థిక ప్రణాళికలే ప్రయోగాజనాన్నిస్తాయి.. : మారుతి చైర్మన్ ఆర్‌సి భార్గవ్‌

long term plans do favor than short term

తరుముతున్న ఆర్థికమాంద్య పరిస్థితికి తాత్కాలిక ఉపశమన ప్రణాళికలతో ప్రయోజనాలు ఉండవని, ఆర్ధిక వ్యవస్థలో వృద్ధిని పెంచకుండా కంపెనీలు కొత్త పెట్టుబడులతో ముందుకు రావని మారుతి సుజుకి ఛైర్మన్‌ ఆర్‌సి భార్గవ్‌ అన్నారు. పెట్టుబడులు పడిపోవడం ద్వారా కొత్త కొలువులు కూడా అందుబాటులోకి రావని హెచ్చరించారు. దేశ సామర్థ్యం మేరకు మన ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగడం లేదని అన్నారు. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీగా ఉన్న మారుతి సుజుకి ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి దీర్ఘకాల నిర్ణయాలు తీసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆర్దిక వ్యవస్థ ఉందన్నారు. అయితే నరేంద్ర మోడీ సర్కారు వృద్ధిని గాడిలో పెట్టేందుకు గాను తగిన ప్రణాళికలను వేస్తున్నప్పటికీ అవి సంతృప్తికరంగా లేవన్నారు. మోడీ సర్కారు ప్రకటిస్తున్న స్వల్పకాలిక ఉపశమనాలతో ఆర్థిక వ్యవస్థకు ఏమాత్రం మేలు జరగదని అన్నారు. ప్రస్తుతం దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమయంలో సూక్ష్మ స్థాయి, దీర్ఘకాలిక ప్రణాళిక ఎంతైనా అవసరమని కేంద్రానికి సూచించారు. దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించి ఆర్థిక వ్యవస్థకు మార్గనిర్దేశనం చేస్తే.. వాటిని దేశంలోని పరిశ్రమలు ముందుకు తీసుకుపోగలవన్నారు.

దేశంలోని పారిశ్రామిక ప్రగతి తిరోగమనంలో ఉందని, వాహనాల తయారీ రంగం తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందని భార్గవ్ ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నిటి ఫలితంగా మందగమనం తీవ్రతరమవుతూ వృద్ధిరేటు పడిపోతూ వస్తోందని అన్నారు. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ కంపెనీగా ఉన్న తమ సంస్థకు దీర్ఘకాలికంగా ఎలాంటి వ్యూహాలతో ముందుకు పోవాలో తెలియని పరిస్థితి ఉందంటే.. మిగతా సంస్థల పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ కారణాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థలో పరిస్థితులు తీవ్రతరం అవుతోన్న నేపథ్యంలో దేశీయ కంపెనీలు భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు పునరాలోచన చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా దేశంలో కొత్త పెట్టుబడులు లోపించి తగిన ఉద్యోగాల సృష్టి కూడా జరగడం లేదని ఆయన విశ్లేషించారు. ప్రస్తుత ప్రతికూల వాతావారణంలో పరిశ్రమల వృద్ధికి దీర్ఘకాలిక వ్యూహాలతో సర్కారు ముందుకు సాగాల్సి ఉంటుందని ఆయన అన్నారు. అయితే ప్రస్తుతం స్వల్పకాలికంగా సమస్య పరిష్కారం చుట్టూనే ఆలోచనలు తిరుగుతున్నాయని తెలిపారు. తయారీ రంగంలో వృద్ధి, ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఎక్కువగా ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దేశం స్వాతంత్య్రం పొంది సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ దేశాభివృద్ధిని గణించేందుకు ఎలాంటి విధానాన్ని అవలంభించాలనే అంశంపై ఇప్పటి వరకు సరైన స్పష్టత లేదని భార్గవ ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts