అసెంబ్లీలో లేని తనంటే వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎందుకంత భయమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. శాసనమండలికి వచ్చే మంత్రులు అక్కడ తన పేరు ఎత్తడానికి ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో లోకేశ్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ తెలుగులో తప్పులున్నాయంటూ పలు వీడియోలు మీడియా సమక్షంలో ఆయన ప్రదర్శించారు. జగన్ తెలుగు, గణితం, ఆంగ్లంలో అన్నీ తప్పులే పలుకుతున్నారని చెప్పుకొచ్చారు. అమెరికాలో చదవటం వల్ల అక్కడక్కడా తెలుగులో తప్పులు దొర్లొచ్చు. నేను పొరపాటున ఒక తెలుగు పదం తప్పు మాట్లాడినంత మాత్రాన పెట్టుబడులు వెనక్కి పోలేదు, పోలవరం ప్రాజెక్టు ఆగలేదు. నేను చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే బ్యాచ్ కాదు. నాన్న గెలిచిన చోటే గెలవాలనుకోలేదు.. ఎప్పుడూ గెలవని మంగళగిరిలో పోటీ చేసి గెలవాలనుకున్నాను. ఓడినంత మాత్రాన మంగళగిరి ప్రజలకు నేను దూరం కాలేదు. ప్రజలను కలుస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాను.
హెరిటేజ్ ఫ్రెష్ అమ్మేశామని చెప్పినా పదే పదే మాకు షేర్లు ఉన్నాయని అసత్యాలు చెప్తున్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన తన అఫిడవిట్‌లోనే అనేక సంస్థల్లో షేర్లు ఉన్నాయని చూపించారు. ఆ సంస్థల ఉత్పత్తుల ధరలు పెరిగితే బుగ్గన బాధ్యత వహిస్తారా?. పాదయాత్రలో అన్నీ పెంచుతూ పోతాం అని జగన్ అంటే ప్రజలు సంక్షేమ ఫలాలు పెంచుతారని భ్రమ పడ్డారు. కానీ అన్ని రకాల ఛార్జీలు పెంచారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచారు.. ఇకముందు అన్నీ పెంచుకుంటూ పోతారు. ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా అన్న జగన్ రాష్ట్రాన్ని ముంచిన ముఖ్యమంత్రిగా నిలిచారు’ అని లోకేశ్ ఆరోపించారు.