ప్రపంచ వ్యాప్తంగా కరోనా వణికిస్తున్న విషయం తెలిసిందే. అయితే అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గతంలో రోజుకు 70 నుంచి 80 వేల కేసులు నమోదైతే, ఇప్పుడు ఆ కేసుల సంఖ్య డబుల్ అయ్యింది. రోజుకు లక్షా 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అమెరికాకు కొత్త అధ్యక్షుడిగా త్వరలోనే పదవీబాధ్యతలు చేపట్టబోతున్న జో బైడెన్ కు ఇది పెద్ద సమస్యగా మారే అవకాశం ఉన్నది. అధికారంలోకి వచ్చిన తరువాత కరోనా కట్టడికి తగిన చర్యలు తీసుకుంటామని, కరోనాను కట్టడి చేయడానికి తమ వద్ద ప్రణాళికలు ఉన్నాయని అన్నారు. పాజిటివ్ కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని, ఎప్పుడు వస్తుందో స్పష్టత లేదని జో బైడెన్ కూడా చెప్పడంతోఅమెరికాలో కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉన్నదో అర్ధం అవుతున్నది. కరోనా తీవ్రత దృష్ట్యా మరలా అమెరికాలో లాక్ డౌన్ విధిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై జో బైడెన్ కొంత క్లారిటీ ఇచ్చారు. కరోనా తీవ్రత ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉందని, దేశం మొత్తం లాక్ డౌన్ విధిస్తే దానివలన కొత్త సమస్యలు తలెత్తుతాయని జో బైడెన్ పేర్కొన్నారు. కరోనాను కట్టడి చేయడంతో పాటుగా ఆర్ధిక వ్యవస్థ సజావుగా ఉండేలా నిర్ణయం తీసుకుంటామని జో బైడెన్ తెలిపారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.