గత ప్రభుత్వ తప్పులు, అప్పులు, పాపాలు, నేరాలే రాష్ట్రానికి శాపంగా మారాయని, స్కాముల కోసమే స్కీములు పెట్టి చరిత్రలో లేని విధంగా రాష్ట్రాన్ని దోచేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు.
ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ప్రజలే. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు పెను విప్లవంలా ఓట్లేసి మమ్మల్ని గెలిపించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముందు నుండీ చెప్పారు.
బీజేపీ కూడా వచ్చి కలవడంతో మూడు పార్టీలు కలిసి పోటీ చేయడం వల్ల 93 శాతం స్ట్రైక్ రేట్ తో సీట్లు సాధించాం. ఇది ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకానికి తార్కాణం. నూటికి నూరు శాతం ప్రజల నమ్మకాన్ని నిలబెడతాం.
ప్రజల ఆశలు నెరవేర్చాలంటే మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉందని, రాత్రికి రాత్రే అద్భుతాలు జరుగుతాయని అనుకోవడం లేదని స్పష్టం చేశారు.
ఒక్కో ఇటుకా పేర్చుకుంటూ ముందుకెళుతున్నామని, వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రాన్ని కేంద్ర సహకారంతో వెలికితీశామని చెప్పారు.
కోట్లు కుమ్మరించి ప్యాలెస్ కట్టుకున్నా దాంట్లోకి వెళ్లలేకపోయారు! కుటుంబ సభ్యులకు కూడా ప్యాలెస్ లు కట్టుకున్నారు. రుషికొండపై 7 బ్లాకులు కట్టారు. పర్యావరణాన్ని విధ్వంసం చేశారు.
రూ.400 కోట్లు సొంత పత్రిక సాక్షికి ప్రకటనల రూపంలో ఇచ్చుకున్నారు. కన్నతల్లిపై అసభ్యకర పోస్టింగులు పెట్టించే వాళ్లు మనుషులా… పశువులా..?
ఎన్డీయే కూటమిలోని నేతలు, కార్యకర్తలు ఎవరూ అసభ్య పోస్టులు పెట్టరు… ఒకవేళ పెడితే కఠినంగా శిక్షిస్తాం. నేరస్తుల రాజకీయ ముసుగు తొలగిస్తాం.
ఆస్తుల సృష్టి జరగలేదు… బటన్లు నొక్కేందుకు అప్పులు తెచ్చారు. అమరావతి, పోలవరం, విద్యుత్ రంగం విధ్వంసం చేశారు. ఐదేళ్లు పెట్టుబడిదారుల్లో నమ్మకం పోయింది.
ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ఏమీ కల్పించలేదు. ఐదేళ్ల పాటు ఆస్తుల సృష్టి లేదు… ఆదాయం పెరగలేదు. ఆదాయం తగ్గింపుతో పాటు పన్నులు పెంచారు. బటన్లు నొక్కేందుకు అప్పులు తెచ్చారు ఆస్తులు తాకట్టు పెట్టారు అని అన్నారు.