సుప్రసిద్ధ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు నివాళ్ళర్పిస్తున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు బాలు మరణించడంపట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. ఆయన ఎస్పీబీ కి నివాళ్ళర్పిస్తూ ట్వీట్ చేసారు. దిగ్గజ గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అస్తమయం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాలు కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. బాలు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని పేర్కొన్నారు. ఆయన ఎన్నో భాషల్లో వేలాది పాటలు పాడి ప్రజల అభిమానం చూరగొన్నారని గుర్తు చేసుకున్నారు. గాయకుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా రాణించారని అన్నారు. “గానగంధర్వుడు శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం దురదృష్టకరం. సినీలోకానికి వారు చేసిన సేవలు వెలకట్టలేనివి. అనేక భాషలలో పాటలుపాడి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న బాలు గారు లేని లోటు ఎన్నటికి పూడ్చలేనిది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి” అని హరీష్ రావు ట్వీట్ చేశారు.
గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరన్నవార్త దిగ్భ్రాంతికి గురిచేసిందని ఏపీ సీఎం జగన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. “గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరన్నవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. 16 భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను” అంటూ ట్వీట్ చేశారు.
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరన్న వార్త వినడానికి చాలా బాధగా ఉందని టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బాలు మృతి విషయం తెలుసుకున్న ఆయన మాట్లాడుతూ బాలు మరణంతో ఓ అద్భుత సినీ శకం ముగిసిందన్నారు. బాలు మరణం దేశ చలన చిత్ర రంగానికి తీరనిలోటన్నారు. కోట్లాది హృదయాలు వేడుకున్నా విధి కరుణించలేదని చంద్రబాబు అన్నారు.
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చనిపోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని సినీ నటుడు, బీజేపీ నేత, మాజీ మంత్రి కృష్ణంరాజు అన్నారు. బాలు మృతి విషయం తెలుసుకున్న ఆయన మాట్లాడుతూ ఎస్పీ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. ఆయన లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. బాలు ఆత్మకు శాంతి కలగాలని దేవుని ప్రార్థిస్తున్నానని, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు కృష్ణంరాజు తెలిపారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ “ఎస్పీబీ తన పాటలతో కొన్ని మిలియన్ల హృదయాలను తాకారని..ఆయన గొంతు మూగబోదని ట్వీట్ చేసారు.
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల పలువురు మంత్రులు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. ఆయన మృతి చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటని అన్నారు. ఈసందర్భంగా తెలంగాణా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ నాలుగు దశాబ్ధాల కాలంలో 40వేలకు పైగా పాటలుపాడి గాన గంధర్వుడిగా అనేక మంది అభిమానులను ఆయన సంపాదించారని అన్నారు. 100కుపై చిత్రాలకు డబ్డింగ్ చెప్పారన్నారు. పాటల దిగ్గజం బాల సుబ్రహ్మణ్యం ఇక లేరు అనే వార్త తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. గాయకుడిగా , నటుడిగా చలన చిత్ర రగానికి ఆనేక సేవలు అందించారని తెలిపారు. బాలు మృతితో చలన చిత్ర పరిశ్రమ ఒక ప్రఖ్యాత గాయకుడిని కోల్పోయిందన్నారు.
బాల సుబ్రహ్మణ్యం మృతిపట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తంచేశారు. కాగా పర్యావరణ, అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఎస్పీబాలు మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. తన పాటలతో ప్రపంచంలోని కోట్లాది మంది సంగీతాభిమానులను అలరించిన బాలు నేపధ్య గాయకుడిగానే కాకుండా నటుడిగా, సంగీత దర్శకుడిగా ప్రేక్షకులను అలరించారని అన్నారు.
తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా భారతీయ చిత్ర పరిశ్రమకు విశేష సేవలందించారని కొనియాడారు. భారతీయ భాషల్లో 40వేలకు పైగా పాలుపడి రికార్డు సృష్టించిన వ్యక్తి బాలసుబ్రహ్మణ్యమని అన్నారు. ఎన్నో అవార్డులు, పురస్కారాలు ఆయన సాధించారని గుర్తుచేశారు. బాలు మృతి భారతీయ చిత్ర పరిశ్రమకు ముఖ్యంగా తెలుగు చిత్ర పరివ్రమకు తీరని లోటని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిపేర్కొన్నారు.
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని ప్రముఖ సంగీత దర్శకుడు కోటీ అన్నారు. ఎస్పీ బాలు మృతిపై స్పందించిన ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఆయన గురించి ఏం చెప్పలేనని, ఒక జ్ఞాని అని కొనియాడారు. తన కేరీర్ ప్రారంభంనుంచే బాలసుబ్రహ్మణ్యంతో ప్రయాణించానని, తన సంగీత దర్శకత్వంలో సుమారు 2 వేల పాటలు పాడారన్నారు. ‘నా పాటలకు ఊపిరి పోశారని, ఆయన ఊపిరితోనే ఇంత ఎదిగానని’ కోటి అన్నారు. బాలు గురించి చాలా మాట్లాడాలని అనుకున్నా.. మాట్లాడలేకపోతున్నానని అన్నారు.