telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కరోనా కట్టడిలో ఏపీ ప్రభుత్వం బేష్: మాజీ జేడీ లక్ష్మీ నారాయణ

JD Laxminarayana filed nomination janasena

కరోనా మహమ్మారి కట్టడి విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీ నారాయణ సమర్థించారు. లాక్ డౌన్ సమయంలో మరిన్ని టెస్టులను చేయడం మంచిదేనని అన్నారు. ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు కనిపించినా మృతుల సంఖ్య తక్కువగానే ఉందని ఆయన గుర్తు చేశారు.

ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటానికి కారణం, అక్కడ జరిపించిన పరీక్షలేనని లక్ష్మీ నారాయణ అభిప్రాయపడ్డారు. కరోనా పరీక్షలను చేయడంలో ఏపీ ప్రభుత్వం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మిన్నగా ఉందని కితాబిచ్చారు. లాక్ డౌన్ తో ప్రభుత్వాలకు కొంత వెసులుబాటు కలిగిందని, ప్రజారోగ్యంపై దృష్టిని సారించే సమయం లభించిందన్నారు.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనల ప్రకారం, ఎన్ని ఎక్కువ టెస్ట్ లు చేస్తే అంత మంచిదని లక్ష్మీ నారాయణ వ్యాఖ్యానించారు. టెస్టులు ఎక్కువగా జరిగిన ప్రాంతాల్లో కేసులు అధికంగా నమోదవుతున్నా, మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉందని గుర్తు చేశారు. కరోనా మృతుల్లో ఇతర సమస్యలున్న కారణంగా మరణించిన వారే అధికమని అన్నారు. సాధ్యమైనంత వరకూ వీలైనన్ని ఎక్కువ పరీక్షలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆయన సూచించారు.

Related posts