telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక సినిమా వార్తలు

ఒక్క ఊరపిచ్చుక కోసం 45 రోజులుగా కరెంటుకు దూరంగా… గ్రామస్తులపై ప్రశంసల వర్షం

Sparrow

ఒకప్పుడు ఊర పిచ్చుకలు జనావాసాల మధ్యనే జీవనం సాగించేవి. కిలకిలారావాలు చేసేవి. ఎప్పుడైతే వ్యవసాయంలో రసాయన మందుల వాడకం మొదలైందో అప్పట్నుంచి ఊర పిచ్చుకల పతనం ప్రారంభమైంది. పురుగు మందుల దాటికి ఊరపిచ్చుక జాతే అంతమయ్యే స్థితికి చేరింది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక ఊర పిచ్చుక కోసం గ్రామస్తులు 45 రోజులుగా వీధి దీపాలు వెలిగించుకోకుండా ఉండటంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. తమిళనాడు రాష్ట్రం శివగంగై జిల్లా పెద్దపూడి గ్రామానికి 45 రోజులకు ముందు ఎక్కడి నుంచో ఓ పిచ్చుక వచ్చింది. ఆ ఊరి వీధిదీపాల మెయిన్ స్విచ్ బోర్డులో దూరింది. వెంటనే అక్కడ గూడుకట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు విద్యుత్ బోర్డు సిబ్బందిని పిలిచి పిచ్చుక గూడును కదిలిస్తే చెదిరి పోతుందని చెప్పి ఇకపై వీధి దీపాలను వెలిగించనక్కర లేదని సూచించారు. కొద్దిరోజుల తర్వాత ఆ పిచ్చుక మెయిన్ స్విచ్ బోర్డులో మూడు గుడ్లు పెట్టి పొదిగింది. రెండు పిచ్చుక పిల్లలు జన్మించాయి. దీంతో పెద్దపూడి గ్రామస్తుల ఆనందానికి హద్దులేకుండా పోయింది. పక్షి పిల్లలకు రెక్కలు వచ్చి ఎగిరిపోయేంత వరకు ఆ మెయిన్ స్విచ్ జోలికి వెళ్లకూడదని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. 45 రోజులుగా ఆ ఊరి ప్రజలు రాత్రి పూట వీధుల్లో కరెంటు దీపాల వెలుతురు లేకుండానే రాకపోకలు సాగించారు. ఆ గ్రామస్తులు పిచ్చుక పై చూపుతున్న ప్రేమపై సోషల్ మీడియాలో వీడియోలు రావడంతో పక్షి ప్రేమికులైన ఆ గ్రామస్తులను అందరూ అభినందనలతో ముంచెత్తుతున్నారు.

Related posts