*హైదరాబాద్ లో మళ్ళీ వర్ష భీభత్సం..
*నీట మునిగిన కోలనీలు..
భాగ్యనగరాన్ని వరుణుడు వీడడం లేదు. సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలో లోతట్టు ప్రాంతాలు, చాలా చోట్ల కాలనీలు నీట మునిగాయి.
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, నాంపల్లి, పాతబస్తీ, కోటి, అబిడ్స్, మలక్పేట్, దిల్ షుక్ నగర్, ముషీరాబాద్, కాప్రా, హెచ్ బికాలనీ, కుషాయిగూడ, రాయదుర్గం, కాజాగూడ, కొత్తపేట, ఎల్బీనగర్, హయత్ నగర్, హిమాయత్ నగర్, నారాయణగూడ, తదితర ప్రాంతాలు మోకాలు లోతు నీరు నిలిచింది.
ఇప్పటికే చెరువులన్నీ దాదాపు నిండిపోవడంతో తాజా వర్షాలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు భయంభయంగా గడుపుతున్నారు. ఊహించని విధంగా కురిసిన వర్షానికి, అర్ధరాత్రి సమయంలో ఇళ్లకు వెళుతున్నవారు తడిసి ముద్దయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
వరద ప్రవాహంలో పలుచోట్ల కార్లు, బైకులు కొట్టుకుపోయాయి. మూసారాంబాగ్ వంతెన పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో మూసారాంబాగ్ నుంచి గోల్నాక వైపు రాకపోకలు నిలిచిపోయాయి. మలక్‌పేట వంతెన కింద భారీగా వరద నీరు నిలిచిపోయింది.
హయత్‌నగర్ 9.2 సెంటీమీటర్లు, హస్తినాపురం సౌత్‌లో 8.8 సెంటీమీటర్లు, అంబర్‌పేటలో 8.2 సెంటీమీటర్లు సైదాబాద్‌లో 8.0 సెంటీమీటర్లు, బహదూర్‌పూరాలో 7.8 సెంటీమీటర్లు, చార్మినార్‌లో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.
భారీ వర్షాలతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో.. మూసీ పరివాహక ప్రాంతాలను అప్రమత్తం చేశారు అధికారులు.
కాగా..తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు జీహెచ్‌ఎంసీ సిబ్బంది సైతం అప్రమత్తంగా ఉన్నారు.