telugu navyamedia
సినిమా వార్తలు

లతా మంగేష్కర్‌ పాడిన‌ తెలుగు పాట‌లు ఇవే..

లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఈ రోజు ఉద‌యం క‌న్నుముశారు. క‌రోనా సోక‌డంతో ముంబయిలోని బ్రీచ్​ కాండీ ఆసుపత్రిలో శ్వాససంబంధిత సమస్యలతో చికిత్స పొందుతూ ల‌తా ఈ రోజు తుదిశ్వాస విడిచారు.

సంగీత ప్రపంచంలో ఒక వెలుగు వెలిగిన లతా మంగేష్కర్‌ 20 భారతీయ భాషల్లో 980 చిత్రాలకు గాను సుమారు 50 వేలకుపైగా పాటలకు గానం అందించారు. అయితే వాటిలో వెయ్యికిపైగా హిందీ పాటలే ఉన్నాయి. 36 ప్రాంతీయ, విదేశీ భాషల్లో పాటలు పాడారు. తెలుగులో కేవలం మూడంటే మూడు పాటలే పాడారు లతా మంగేష్కర్‌.

1955లో అక్కినేని నాగేశ్వర రావు, సావిత్రి నటించిన ‘సంతానం’ చిత్రంలో తొలిసారి లత నోట తెలుగుపాట పలికింది. సుసర్ల దక్షిణామూర్తి స్వరకల్పనలో లత తన తొలి తెలుగు పాట “నిదుర పోరా తమ్ముడా…” గానం చేసి అలరించారు. ఈ పాట ఈ నాటికీ సంగీతాభిమానులను పరవశింప చేస్తూన ఉంది.

తర్వాత 1965లో సీనియర్ నందమూరి తారక రామారావు, జమున జంటగా నటించిన ‘దొరికితే దొంగలు’ సినిమాలోది. ఇందులో ‘శ్రీ వెంకటేశా’ అనే గీతాన్ని ఆలపించారు లతా మంగేష్కర్‌. ఈ పాటను సాలూరి రాజేశ్వర రావు కంపోజ్‌ చేశారు.

1988లో నాగార్జున, అతిలోక సుందరి శ్రీదేవి జంటగా నటించిన ‘ఆఖరి పోరాటం’లో ఇళయరాజా స్వరకల్పన‌లో దివంగత గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లత “తెల్లచీరకు తకధిమి…” పాటను ఆలపించారు.

ఇక 1991లో యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ హిందీ వర్షన్ లో లతా మంగేష్కర్ గానం చేశారు. ఈ చిత్రానికి రవీంద్ర జైన్ సంగీతం సమకూర్చారు.

మరో విశేషమేమంటే, ఆ ఇద్దరు మహానటుల పేరున నెలకొల్పిన జాతీయ అవార్డులనూ లతా మంగేష్కర్ సొంతం చేసుకున్నారు. 1999లో యన్టీఆర్ జాతీయ అవార్డు, 2009లో ఏయన్నార్ జాతీయ పురస్కారం లతా మంగేష్కర్ కు లభించాయి.

 

Related posts