telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సాహో”పై ఫ్రెంచ్ దర్శకుడి వ్యాఖ్యలు… తెలుగు దర్శకులకు చురకలు

Saaho

ఇటీవల కాలంలో తెలుగు సినిమాలు ఎక్కువగా కాపీ ఆరోపణలను ఎదుర్కొంటున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో ఏ దర్శకుడు ఏ సీన్ ను ఎక్కడ కాపీ కొట్టాడనే విషయాన్నీ నెటిజన్లు ఇట్టే పసిగట్టేస్తున్నారు. అంతేకాదు ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టుల రూపంలో ప్రపంచానికి చాటి చెబుతున్నారు. దీంతో మన దర్శకుల ప్రతిభ ఏంటో ప్రపంచానికి తెలిసిపోతోంది. కొంతకాలం క్రితం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన “అజ్ఞాతవాసి”పై ఫ్రెంచ్ చిత్రం ‘లార్గో వించ్’ దర్శకుడు జెరోమ్ సాలీ త‌న సినిమాని కాపీ చేసి “అజ్ఞాత‌వాసి” చిత్రాన్ని తెర‌కెక్కించార‌ని త‌న ట్విట్ట‌ర్ ద్వారా ప‌లు ఆరోప‌ణ‌లు చేశాడు. ఇప్పుడు మ‌రోసారి ఆయ‌న టాలీవుడ్ భారీ బ‌డ్జెట్ చిత్రం “సాహో”ని త‌న సినిమాకి కాపీ అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. “లార్గోవించ్” అనే సినిమా అదే పేరు కలిగిన హాస్యప్రధాన నవల ఆధారంగా రూపొంద‌గా… ఒక కోటీశ్వరుడి రహస్య దత్తపుత్రుడు, తన తండ్రి హంతకులను కనుగొని శిక్షించడం కోసం అజ్ఞాతవాసం చేయడం ఈ సినిమా ఇతివృత్తం. “అజ్ఞాత‌వాసి” చిత్రం దాదాపు ఇదే సినిమాని పోలి ఉన్న‌ప్ప‌టికి, “సాహో” క‌థ‌నం కాస్త డిఫ‌రెంట్‌గా ఉంటుంది. కాక‌పోతే మూల కథ దాదాపు లార్గో వించ్‌ను పోలి ఉండటంతో నెటిజ‌న్స్ కూడా లార్గోవించ్‌కి కాపీ అని ఆరోపిస్తున్నారు. ఓ నెటిజ‌న్ జెరోమ్ సాలిని ట్యాగ్ చేస్తూ “సాహో” చిత్రం లార్గో వించ్‌కి ఫ్రీమేక్ అని, మీరు రియ‌ల్ గురూజీ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కి కాస్త వ్యంగ్యంగా బదులిచ్చిన జెరోమ్ “నాకు భారతదేశంలో మంచి కెరీర్ ఉందని నేను భావిస్తున్నాను. లార్గో వించ్ యొక్క రెండవ ఫ్రీమేక్ మొదటిదాని క‌న్నా చెడ్డగా అనిపిస్తుంది. కాబట్టి దయచేసి తెలుగు దర్శకులు, మీరు నా పనిని దొంగిలించినట్లయితే, కనీసం దాన్నయినా సరిగ్గా చేయండి” అంటూ చుర‌క‌లు అంటించారు.

Related posts