ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా స్థానిక కోర్టులో లొంగిపోయాడు.. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆదివారం జ్యూడిషల్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట అశిష్ మిశ్రా లొంగిపోయాడు.
అనంతరం అధికారులు అతడిని లఖింపూర్ జైలుకు తరలించారు. నిందితుడు ఆశిష్ మిశ్రాకు భద్రతా కారణాల వల్ల జైలులో ప్రత్యేక గదిని కేటాయించినట్లు జైలు అధికారులు తెలిపారు.
ఇక, అశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను ఈ నెల 18న సుప్రీం కోర్టు రద్దు చేసింది. వారం రోజుల్లోగా లొంగిపోవాలని అశిష్ మిశ్రాను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు ఇచ్చిన గడువుకు ఒక్క రోజు ముందుగానే అశిష్ మిశ్రా కోర్టు ఎదుట లొంగిపోయాడు. .
లఖింపుర్ ఖేరీ జిల్లా టికునియా- బన్బీర్‌పుర్ సరిహద్దు వద్ద నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా యూపీలోని లఖింపూర్ ఖేరిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై నుంచి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా వాహనాలు దూసుకెళ్లాయి. ఈ ఘటనలో నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు మరణించారు.
రైతులపైకి దూసుకెళ్లిన వాహనాల్లో ఒకటి కేంద్ర మంత్రి అజాయ్ మిశ్ర కుమారుడు అశిష్ మిశ్రాది. దీంతో ఆగ్రహించిన రైతులు వాహనాలకు నిప్పంటించారు. ఈ క్రమంలోనే ముగ్గురు బీజేపీ కార్యకర్తలు కూడా ప్రాణాలు కోల్పోయారు.