telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ట్రాఫిక్ రద్దీపై .. కేటీఆర్ సమీక్ష .. కొత్త దారులే సరైనవా ..

ktr trs president

ట్రాఫిక్‌ రద్దీపై మున్సిపల్‌శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈమేరకు నగరంలో అవకాశం ఉన్న స్లిప్‌రోడ్లపై (ప్రధాన రోడ్లకు అనుసంధానం చేసేవి) మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు శనివారం ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈమేరకు నగరంలో అత్యధిక ట్రాఫిక్‌ జాం ఉండే ప్రాంతాల్లో సాధ్యమైనన్ని ఎక్కువ రోడ్లను ఏర్పాటుచేసి దీర్ఘకాలంలో రద్దీని తగ్గించడమే లక్ష్యంగా జీహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఎ, హైదరాబాద్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లు కలిసి రూపొందించిన సమగ్ర నివేదిక పై మంత్రి కేటీఆర్‌చర్చించారు. దీని కోసం క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళిక ఉండాలని అన్నారు. ప్రస్తుతం ఉన్న జనసాంద్రత, భవిష్యత్‌ విస్తరణం, ట్రాఫిక్‌ అధ్యయనం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. నగర రోడ్డు నెట్‌వర్క్‌ ను బలోపేతం చేసేందుకు అవసరమైన రైల్వే వంతెనలు(ఆర్వోబీలు, ఆర్‌యూబీలు) గుర్తించి రైల్వేశాఖ నుంచి అనుమతులు పొందే ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. అవసరం అయిన చోట్ల జంక్షన్ల అభివృద్దిపై కూడా దృష్టిసారించాలని అన్నారు.

ముఖ్యంగా పశ్చిమ హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న రోడ్‌ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేస్తూ మరిన్ని స్లిప్‌రోడ ్లను ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసి అధికారులను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. జూబ్లీహిల్స్‌ నుంచి నాలెడ్జి సిటీవైపు, ఓల్డ్‌ బొంబాయి హైవే వరకు స్లిప్‌రోడ్లను నిర్మించాలని ప్రతిపాదించారు. ఇక ఫైనాన్షియల్‌ డిస్ర్టిక్ట్‌ నుంచి కోకాపేట, కొల్లూరు, తెల్లాపూర్‌ వరకు ఓఆర్‌ఆర్‌ను కలుపుతూ హైదరాబాద్‌ గ్రోత్‌కారిడార్‌ ప్రణాళికలో ఉన్న ఆర్టిలరీ రోడ్లకు అదనంగా నూతన రోడ్లకు రూపుకల్పన చేస్తోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం కలిగే మిక్సింగ్‌ రోడ్ల వివరాలు పురపాలక శాఖకు తెలపాలని మంత్రి కేటీఆర్‌ ప్రిన్సిపల్‌సెక్రటరీ అరవింద్‌కుమార్‌ను కోరారు. దీంతోపాటు రియల్‌ ఎస్టేట్‌ సంస్థల నుంచి కూడా సలహాలు స్వీకరిస్తామని ఈసందర్భంగా మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

Related posts