telugu navyamedia
తెలంగాణ వార్తలు

కేటీఆర్ డైలాగ్స్ కి అసెంబ్లీలో చప్పట్ల మోత..

*పార్లమెంట్ కొత్త భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలి 
*తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ తీర్మానం
*అంబేడ్కర్ గారు రాసిన రాజ్యాంగం లేకపోతే తెలంగాణయే లేదు

ఢిల్లీలో నిర్మిస్తున్న పార్లమెంటు కొత్త భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలనే తీర్మానాన్ని శాసనసభలో మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టారు.

పార్లమెంట్ కొత్త భవనానికి డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలన్న తీర్మానంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. దేశంలో అన్ని వర్గాలకు సమానమైన న్యాయం జరగాలన్నది అంబేడ్కర్ గట్టిగా కోరుకున్నారని చెప్పారు.

అంబేడ్కర్ చూపిన బాటలోనే తెలంగాణ సర్కార్ నడుస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. స్వేచ్ఛ‌, సమాన‌త్వం కోరిన వ్య‌క్తి అంబేద్క‌ర్ అన్నారు. అంబేద్క‌ర్ త‌త్వాన్ని టీఆర్ఎస్ ఆచ‌ర‌ణ‌లో చూపింద‌ని మంత్రి తెలిపారు.

రాజ్యాంగంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా ఆయన స్ఫూర్తిని కనబరిచారని చెప్పారు. డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం కారణంగానే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు.

ఎంతో గొప్ప ఆలోచనలు కలిగిన అంబేడ్కర్ గారిని కొన్ని వర్గాల నేతగా మార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మహత్మా గాంధీకి ఏమాత్రం తక్కువ కాని నేత అంబేడ్కర్ అన్నారు. కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ గారి పేరు పెట్టాల్సిందేనని అన్నారు.

అలాగే అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం దుర్వినియోగం అయితే స్వయంగా తానే దాన్ని తగులబెడతానని ఆయన అన్నట్లు గుర్తు చేశారు. భాషాధిపత్యాన్ని, ప్రాంతీయ ఆధిపత్యాన్ని ఆయన వ్యతిరేకించారన్నారు

టెంపుల్ ఆఫ్ డెమోక్రసీకి పేరు పెట్టడానికి ఆయనకంటే మించిన, సరైన వ్యక్తి లేరని తెలిపారు. అందుకే కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలన్నారు. 

అంబేద్క‌ర్ రాసిన రాజ్యంగంలో ఆర్టిక‌ల్-3 లేక‌పోతే.. కొత్త రాష్ర్టాల‌కు అవ‌కాశం ఇవ్వ‌క‌పోతే..నేడు తెలంగాణ రాష్ర్ట‌మే లేదు. శాస‌న‌స‌భే ఉండేది కాదు.. రాష్ర్ట శాస‌న‌స‌భ ఆమోదంతో గానీ.. శాస‌న‌స‌భ అంగీకారంతో నిమ్మితం లేకుండానే ..పార్ల‌మెంట్ లో సింపుల్ మెజార్టీతో కొత్త రాష్ర్టాన్ని ఏర్పాటు చేయ‌వ‌చ్చున‌ని చెప్పి ఆర్టిక‌ల్ -3 పొందుప‌రిచారు.  కాబట్టి ఆ మహానుభావుడికి యావత్ తెలంగాణ సర్వదా.. శతదా రుణపడి ఉంటుందని కేటీఆర్ అంబేద్కర్ ని అత్యంత గొప్పగా కీర్తించారు. ఈ డైలాగ్స్ కి అసెంబ్లీలో చప్పట్ల మోత మోగింది.

 

Related posts