telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కరోనా వ్యాక్సిన్ : తెలంగాణ ప్రజలకు కేటీఆర్ గుడ్ న్యూస్

సాధ్యమైనంత త్వరగా ప్రజలందరికీ టీకాలు వేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. ఇందుకోసం అవసరమైన వ్యాక్సిన్లను సేకరించేందుకు టీకా తయారుచేస్తున్న స్థానిక కంపెనీలతోపాటు అంతర్జాతీయ సంస్థలతోనూ సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. భారీ ఎత్తున వ్యాక్సిన్లను ప్రొక్యూర్‌ చేసుకొనేలా ముందస్తు ప్రణాళికతో వ్యవహరిస్తున్నామని తెలిపారు.
మంత్రి కేటీఆర్‌ సారధ్యంలోని కరోనా టాస్క్‌ఫోర్స్‌ కమిటీ శనివారం ప్రగతిభవన్‌లో రాష్ట్రంలో కొవిడ్‌ మందుల సరఫరా, వ్యాక్సిన్‌ సేకరణ తదితర అంశాలపై ఫార్మా సంస్థల ప్రతినిధులతో సమావేశమైంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. కొవిడ్‌ నియంత్రణకు అవసరమైన అన్ని మందుల ఉత్పత్తిని పెంచాలని కోరారు. అందుకు అవసరమైన సహాయ, సహకారాలను అందిస్తామని చెప్పారు.
కరోనా మహమ్మారిని పూర్తిగా పారదోలాలంటే ప్రజలందరికీ వీలైనంత త్వరగా టీకా వేయాల్సి ఉన్నదన్నారు. ఈ మేరకు వ్యాక్సిన్‌ సరఫరా పెంపుపై రాష్ర్టాల్లో వ్యాక్సిన్‌ తయారీలో నిమగ్నమైన భారత్‌ బయోటెక్‌, బయోలాజికల్‌-ఈ వంటి సంస్థలకు స్థానికంగా అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తామని చెప్పారు.
టాస్క్‌ఫోర్స్‌ సమావేశానికి నాటో ఫార్మా, బయోలాజికల్‌- ఈ, భారత్‌ బయోటెక్‌, సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, సనోఫి ఇండియా, వర్చ్యు బయోటెక్‌, గ్లాండ్‌ ఫార్మా, ఇండియన్‌ ఇమ్యునోలాజికల్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశంలో టాస్‌ఫోర్స్‌ సభ్యులు పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, జీఏడీ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్‌, పంచాయతీరాజ్‌ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ కమిషనర్‌ రాహుల్‌ బొజ్జా, సీఎంవో కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ ఎండీ నరసింహారెడ్డి, శక్తి నాగప్పన్‌ పాల్గొన్నారు.
కరోనా నియంత్రణ కార్యక్రమాలకు చేయూత
రాష్ట్రప్రభుత్వం కరోనా నియంత్రణకు కోసం చేస్తున్న కార్యక్రమాలకు టీఎస్‌ఐఐసీ తన కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద రూ.1.19 కోట్లు అందజేసింది. కార్పొరేషన్‌ ఎండీ నరసింహారెడ్డి, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ ఇందుకు సంబంధించిన చెకును మంత్రి కేటీఆర్‌ సమక్షంలో డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ కమిషనర్‌ రాహుల్‌ బొజ్జాకు అందించారు. నాటోఫార్మా వైస్‌చైర్మన్‌, సీఈవో రాజీవ్‌ నన్నపనేని రూ.4.2 కోట్ల విలువైన బారిసిటినిబ్‌ మాత్రల విరాళానికి సంబంధించిన అనుమతి పత్రాన్ని మంత్రి కేటీఆర్‌కు అందజేశారు.

Related posts