దక్షిణ భారత సినిమా రంగం లో దర్శకుడు కె ఎస్ ఆర్ దాసు అంటే తెలియని వారు వుండరు . తెలుగు, కన్నడ , హిందీ చిత్ర రంగాల్లో తనదైన ముద్ర వేసిన దర్శకుడు . జేమ్స్ బాండ్ , యాక్షన్ చిత్రాలు అనగానే వెంటనే గుర్తుకొచ్చే పేరు కె ఎస్ ఆర్ దాసు . అలాంటి దాసు గారిని హైద్రాబాదులో శబ్దాలయ థియేటర్లో 19 సంవత్సరాల క్రితం ఇదే రోజు కలిశాను . అప్పుడు వారు “నాగులమ్మ “అనే సినిమాకు దర్శకత్వం వహించాడు . ఆ సినిమా డబ్బింగ్ శబ్దాలయలో జరుగుతుంది .
అప్పుడు జర్నలిస్టు మిత్రుడు జగన్ తో దాసుగారిని కలసి ఇంటర్వ్యూ చేశాను . అప్పుడు నేను ఆంధ్ర ప్రభ దిన పత్రికలో సినిమా పేజీ ఇన్ చార్జిగా వున్నాను . ఆరోజు నేను దాసుగారితో మొదటిసారి ఎప్పుడు కలిసింది గుర్తుచేశాను . “అన్నదమ్ముల సవాల్ ” క్లైమాక్స్ అప్పుడు ఒక రోజంతా మీతో వున్నాను . “అవునవును గుర్తుకొస్తుంది” అన్నారు శ్రీసారధి స్టూడియోస్ వారు నిర్మించిన “అన్నదమ్ముల సవాల్ ” చిత్ర నిర్మాణ సమయంలో . దాసుగారి దర్శకత్వంలో కృష్ణ, రజనీకాంత్, జయ చిత్ర, చంద్ర కళ నటించారు . జి డి .ప్రసాద్ రావు , శశిభూషణ్ గారు నిర్మాతలు .
1978 జనవరి మాసంలో ఈ చిత్ర క్లైమాక్స్ ఉందని జర్నలిస్టు మిత్రులను నిర్మాత శశిభూషణ్ గారు ఆహ్వానించారు . నేను అప్పుడు వెండితెర సినిమా వార పత్రికలో సినిమా రిపోర్టర్ గా పనిచేస్తున్నాను. . “అన్నదమ్ముల సవాల్ ” చిత్రం క్లైమాక్స్ జూబిలీ హిల్స్ కొండల్లో జరుగుతుంది . కృష్ణ , రజనీకాంత్, అంజలీదేవి ,జయ చిత్ర , చంద్ర కళ , కన్నడ ప్రభాకర్ , అనేక మంది జూనియర్ ఆర్టిస్టులు వున్నారు . రెండు వైపులా కొండలు , మధ్యలో లోయ, రెండు పెద్ద టెంట్లు వేశారు , ఒకటి జూనియర్ ఆర్టిస్టులకు , మరొకటి ప్రధాన నటీనటులకు , దర్శకుడు, నిర్మాత కోసం . జోర్నలిస్టు మిత్రులను శశిభూషణ్ కృష్ణ , రజనీకాంత్, దర్శకుడు దాసు గారికీ పరిచయం చేశారు .
ఆ ఎండలో ఉండి ఆర్టిస్టులు షూటింగ్ చేయడం చాలా ఆశ్చర్యమనిపించింది . నిలుచోటానికి ఒక్క చెట్టు కూడా లేదు . టెంటు లో వున్నా కూడా ఉక్క పోస్తుంది . ఇక మధ్యాన్నం అదే టెంటులో కృష్ణ, రజనీకాంత్ , అంజలీదేవి , జయచిత్ర , చంద్ర కళ , కన్నడ ప్రభాకర్, దాసు, శశిభూషణ్ తో పాటు మాకు కూడా భోజనం ఏర్పాటు చేశారు . వారు వడ్డించిన చికెన్ లో కారం ఎక్కువైంది . మాకు మంటపుడుతోంది . కళ్ళమ్మట నీళ్లు వచ్చేస్తున్నాయి .
అయితే కృష్ణ గారు మాత్రం హాయిగా భోజనం చేస్తూ మావైపు చూశారు . “చికెన్ లో కారం బాగా ఎక్కువైంది ” అన్నాను ఆయన వైపు చూస్తూ . “ఆబ్బె అదేం లేదే , నాకు బాగా సరిపోయింది బి అన్నారు . అప్పుడు తెలిసింది కృష్ణ గారు ఎంత కారం తింటారో ! ఇక అప్పుడు షూటింగ్ చేసిన లొకేషన్ ఇప్పుడున్న జూబిలీ హిల్స్ జర్నలిస్ట్ “ఏ ” కాలనీ నుంచి ఆంధ్ర జ్యోతి దిన పత్రిక ఆఫీస్ రోడ్ చివరిలో వున్న చెరువు వరకు . అప్పట్లోనే భారీ క్లైమాక్స్ అక్కడ ప్లాన్ చేసి తీశారు . కృష్ణ గారు హెలికాఫ్టర్ లో వస్తారు . అప్పట్లో ఈ ప్రాంతం అంతా నిర్మానుష్యంగా ఉండేది అంటే ఇప్పుడు ఎవరు నమ్మరు.
విశేషం ఏమిటంటే అదే జర్నలిస్టు కాలనీ ప్రభుత్వం వారు జర్నలిస్టులకు స్థలాలు ఇచ్చారు . జర్నలిస్టుగా నాకు కూడా స్థలం కేటాయించారు . నేను ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటున్నా . కాబట్టి అప్పటి నుంచి దాసు గారు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా కలుస్తూవుండేవాడిని . దాసుగారు తెలుగు , కన్నడ , హిందీలో 105 చిత్రాలకు దర్శకత్వం వహించారు . హీరో కృష్ణతో 30 చిత్రాలకు పనిచేశారు. వారిద్దరి కంబినేషన్లో వచ్చిన మోసగాళ్లకు మోసగాడు , జేమ్స్ బాండ్ 777, అన్నదమ్ముల సవాల్ , ఇద్దరు అసాధ్యులే మొదలైనవి వున్నాయి . కన్నడ హీరో విష్ణు వర్దంతో 14 చిత్రాలకు పనిచేశారు . ఆయన మొదటి సినిమా 1966 లో వచ్చిన “లోగుట్టు పెరుమాళ్ళకెరుక ” ఇందులో శోభన్ బాబు హీరో.
ఎన్టీఆర్ , చిరంజీవి, రజనీకాంత్ తో దాసు గారు పనిచేశారు . ఆయన ఎన్ని సుపుర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించినా నిజ జీవితంలో చాలా సామాన్యంగా ఉండేవారు . ఎలాంటి ఆడంబరం , దర్పం కనిపించేవి కాదు . సినిమా గ్లామర్ ఒంటపట్టని దర్శకుడు దాసు గారు .
2000 సంవత్సరంలో వచ్చిన “నాగులమ్మ ” దర్శకుడుగా ఆయన చివరి చిత్రం . జూన్ 8 , 2012 వ సంవత్సరంలో దాసు గారు మరణించారు .
– భగీరథ