కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ టీడీపీలోకి వెళ్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో తమకు విభేదాలు ఉన్నట్టు వస్తున్న వార్తలలో నిజం లేదని, ఆయనతో కలసి పని చేసేందుకు తమకు అభ్యంతరం లేదని కోట్ల తెలిపారు. 20 ఏళ్ల క్రితం ఫ్యాక్షన్ ఎక్కువగా ఉన్న రోజుల్లోనే మూడు ఎన్నికల్లో కలసి పని చేశామని… ఇప్పుడు ఫ్యాక్షన్ కూడా లేదని, గ్రామాలు ప్రశాంతంగా ఉన్నాయని చెప్పారు.
టీడీపీలో తాము చేరేది సీట్ల కోసం కాదని కోట్ల స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశిస్తే కర్నూలు ఎంపీగా తాను పోటీ చేస్తానని చెప్పారు. తన భార్య సుజాతమ్మ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని, తన కుమారుడు రాఘవేంద్రరెడ్డి ఎన్నికల్లో పోటీ చేయరని తెలిపారు. 2024లో తన స్థానంలో తన వారసుడిగా ఎంపీగా పోటీ చేస్తారని చెప్పారు. కోడుమూరులో మంచి అభ్యర్థిని పోటీలో నిలపాలని చంద్రబాబుకు సూచిస్తామని అన్నారు.