telugu navyamedia
సినిమా వార్తలు

కొంగర జగ్గయ్య గారిని  ఇంటర్వ్యూ. అడిగితే… ఏమన్నారో తెలుసా ?

Kongara Jaggayya Special Interview
సినిమా రిపోర్టర్ గా ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసి వుంటాను . కొన్ని తప్పనిసరిగా చేసినవి . మరికొన్ని వారు కోరితే తప్పని ఇంటర్వ్యూ లు. మరికొన్ని నాకు ఎంతో సంతృప్తిని కలిగించినవి . నా 40 సంవత్సరాల వృత్తి జీవితంలో కొన్ని వందల ఇంటర్వ్యూలు చేసి వుంటాను . 
అయితే అందులో నా మనసుకు నచ్చినవి , ఎందరో విమర్శకులు మెచ్చినవి , ఇప్పటికీ గుర్తుకొచ్చేవి కొన్ని మాత్రమే. అలాంటివాటిలో కళావాచస్పతి కొంగర జగయ్య గారి ఇంటర్వ్యూ ఒకటి . 
1983వ సంవత్సరం మర్చి నెల  2వ తేదీ  అనుకుంటాను. హైదరాబాద్ జూబిలీహిల్స్ లో నిర్మాత క్రాంతి కుమార్ గారి “శివుడు శివుడు శివుడు ” చిత్రం షూటింగ్ జరుగుతుంది . ఈ సినిమాలో చిరంజీవి హీరో , హీరోయిన్ రాధిక , జగ్గయ్య, రావు గోపాల రావు ముఖ్య పాత్రలు ధరిస్తున్నారు . కోదండరామిరెడ్డి దర్శకుడు .ఇప్పటి ఆంధ్ర జ్యోతి కార్యాలయం కు కొంచెం ముందు ఈ చిత్రం షూటింగ్ కోసం సెట్స్ వేశారు . ఆ షూటింగ్ కవర్ చెయ్యడం కోసం జర్నలిస్టులను ఆహ్వానించారు . 
నాకు జగ్గయ్య గారంటే ఎంతో అభిమానము ,ఇష్టం . షూటింగ్ ప్రెస్ మీట్ అయిపోయిన తరువాత నేను జగ్గయ్య గారి దగ్గరకు వెళ్లి నన్ను పరిచయం చేసుకున్నాను . వారిని మొదటి సారి 1967లో చూశాను . అప్పుడు ఒంగోలు పార్లమెంట్ సభ్యుడుగా పోటీ చేశారు .కాంగ్రెస్ పార్టీ టికెట్ ఫై పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా మా వూరు “నాగండ్ల ” వచ్చారు . ఆ విషయం వారికి గుర్తు చేశాను . ఆ తరువాత “మీతో ఓ ఇంటర్వ్యూ కావాలి ” అని అడిగాను . 
” నా ఇంటర్వ్యూ … ఎందుకు?  రొటీన్  ప్రశ్నలు … నాకు అలాంటి ఇంటర్వ్యూ ఇష్టం లేదు ” అని చెప్పారు  “రొటీన్  కాదు ఓ డిఫరెంట్  ఇంటర్వ్యూ …. ” అని ఆయన వైపు చూశాను . ఆయన నవ్వి “ప్రతి సినిమా జర్నలిస్ట్ … డిఫరెంట్  అనే అంటాడు ” అన్నాడు .
 
ఆ మాటతో నా అహం కొంచెం దెబ్బతింది . “అదికాదు సర్ … మరో పదం తెలియక అలా అన్నాను .. మీ గురించి నాకు తెలుసు … రొటీన్  ఇంటర్వ్యూ అయితే మాత్రం కాదు ” అన్నాను మరి ఏమిటి ? అన్నట్టు చూశారు . 
“బెంగాలీ సాహిత్యం  ముఖ్యంగా  రవీంద్ర నాథ్ టాగోర్ , శరత్ చంద్ర  చటోపాధ్యాయ , బకింబాబు మీద చేద్దాం ” అన్నాను . జగయ్య గారి కనుబొమలు పైకి లేచాయి . నా వయిపు అలాగే చూస్తుండిపోయాడు . మీరు చెప్పేది నిజమేనా ? అన్నట్టు వున్నాయి ఆయన చూపులు . “అవును సర్ దాని మీదనే చేద్దాము” అన్నాను . 
“మీరు సినిమా జర్నలిస్టేనా ?” అన్నారు . 
“అవును సర్ “
“మరి సినిమా జర్నలిస్టుకు  ఇలాంటివి కూడా తెలుసా ?”
“తెలియకూడదని ఉందా ?” అన్నాను . 
“మీరేం చదివారు ?” అడిగారు . 
“బి. ఏ … “
“సినిమా పాఠకులకు బెంగాలీ  సాహిత్యం , టాగోర్ , శరత్  బాబు , బంకిం బాబు ఎందుకు ? అన్నారు 
“కొంగర జగ్గయ్య గారు కేవలం సినిమా నటుడు ,డబ్బింగ్ ఆర్టిస్ట్ , రేడియా లో వార్తలు చదివే వారు మాత్రమే కాదు . ఆయనలో చాలా మందికి తెలియని మరో కోణం వుంది అని సినిమా పాఠకులను తెలియ చెప్పడమే నా ఉద్దేశ్యం ” అన్నాను . 
జగ్గయ్య గారు నవ్వి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు … 
ఆ ఇంటర్వ్యూ విశేషాలు  రేపు…
-భగీరథ

Related posts